హితేశ్ చంద్రనీ.. ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జోమాటో డెలివరీ బాయ్ తనను దారుణంగా కొట్టాడని, ముక్కు పగలకొట్టాడని ఈ మధ్య తెగ హల్‌చల్ చేసిన హితేశ్ ఇప్పుడు ఏకంగా తన మకాం మార్చేసింది. ఈ విషయాన్ని పోలీసులే గుర్తించారు. ఆమె ఇంటికి వెళ్లడంతో ఎవరూ లేకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు వారు చెబుతున్నారు.
కాగా హితేశ్ గత వారం జొమాటో డెలివరీ బాయ్ కమల్రాజ్ తనపై దాడిచేసి గాయపరిచాడంటూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి ఆమె తన సోషల్ మీడియాలో రక్తం కారుతున్న ముక్కుతో వీడియోలు కూడా ఆన్‌లైన్‌లో పెట్టింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఇటీవల కమల్రాజ్ కూడా హితేష చంద్రనీపై కౌంటర్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. తాను లేట్‌గా డెలివరీ చేయడంతో హితేష తనను ఇష్టం వచ్చినట్లు తిట్టి చెప్పుతో కూడా కొట్టిందంటూ కమల్రాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కేసు నడుస్తుండగానే హితేష చంద్రనీ ఇంటి అడ్రస్ సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో ఆమె బెంగళూరు వదిలి వెళ్లిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. స్థానిక పోలీస్ ఇన్స్‌పెక్టర్ అనిల్ కుమార్ చెబుతున్న వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో హితేశ్ ఆడ్రస్ లీక్ అయిందని, అసలే సోషల్ మీడియాలో ఈ కేసుపై నెటిజర్ల మధ్య వార్ జరుగుతోందని, అందువల్లే భయంతో హితేష తన సేఫ్టీ కోసం బెంగళూరు వదిలి వెళ్లి ఉంటుదని పోలీసులు చెబుతున్నారు. ఆమె తమను త్వరలో సంప్రదించే అవకాశం ఉందని వెల్లడించారు.