నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి ఒక్కసారిగా చేరుకున్న సీఐడీ అధికారులు వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ-ఏ నాన్‌బెయిలబుల్ కేసు, 153ఏ, 505, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతప్తిని ప్రేరేపించేలా రెచ్చగొడుతుండడం వంటి ఆరోపణలతో ఆయనపై ఫిర్యాదులు అందాయని, వాటి ప్రకారమే అరెస్టు చేశామని సీఐడీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అయితే రఘురామను ఆయన పుట్టినరోజు నాడే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చ జరుగుతోంది.
గత కొంతకాలంగా ఏపీ సర్కార్‌పై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం జగన్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు రావడం.. అరెస్ట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లేపుతోంది. వారిని సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నా.. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని చెబుతున్నా.. పట్టించుకోని సీఐడీ అధికారులు రఘురామను అరెస్టు చేసి తీసుకెళ్లారు.
రఘురామకృష్ణరాజు అరెస్ట్‌పై ఆయన తనయుడు భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కారణాలు కూడా చెప్పకుండా.. కోర్టులో చూసుకోండంటూ సీఐడీ అధికారులు చెప్పేసి తీసుకెళ్లిపోయారని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రిని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని, అధికారం చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్లు చేస్తారా..? అని భరత్ ప్రశ్నించారు. కరోనా సమయంలో ఓ ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారని, ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదని, ఇదంతా ఓ స్కెచ్ ప్రకారమే చేసినట్లు అనిపిస్తోందని భరత్ అన్నారు. అంతేకాకుండా తన తండ్రిని అరెస్టు చేసిన ఆఫీసర్ల పద్ధతి చూస్తే వాల్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో కూడా అర్థం కాలేదని అన్నారు. తన తండ్రి అరెస్ట్‌పై కోర్టులో హౌస్‌మోషన్ దాఖలు చేస్తామని భారత్ పేర్కొన్నారు.