ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా టీమిండియా టాపార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ ఎడమ చేతికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. బంతిని ఆపేందుకు డైవ్ చేయడంతో అతడి భుజం గట్టిగా నేలను తాకింది. దీని కారణంగా మైదానంలోనే విలవిల్లాడిపోయిన అయ్యర్.. వెంటనే మైదానాన్ని వీడాడు. జట్టు సభ్యులు, మెడికల్ సిబ్బంది సాయంతో బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. అతడి గాయాన్ని పరీక్షించిన వైద్య సిబ్బంది.. షాకింగ్ విషయాలను వెల్లడించారు. అయ్యర్‌కు తగిలిన గాయం చాలా తీవ్రమైందని, భుజం నేరుగా నేలను తాకడం వల్ల అక్కడి కండరం చీలిపోయిందని వెల్లడించారు. దీనిని నుంచి అయ్యర్ కోలుకోవాలంటే శస్త్ర చికిత్స చేయాలని, ఆ తరువాత కూడా సుదీర్ఘ రెస్ట్ అవసరమని చెప్పారు. దీంతో అతడు టీమిండియా తదుపరి టోర్నీలకే కాకుండా.. ఐపీఎల్‌కు కూడా పూర్తిగా దూరమయ్యాడు.
అయ్యర్ గాయంపై వైద్య సిబ్బంది స్పందిస్తూ.. ‘గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే శస్త్ర చికిత్స చేయాలి. ఆ తర్వాత కనీసం 5 నెలల పాటు రెస్ట్ తీసుకోవాలి. ఏప్రిల్ 8న శస్త్ర చికిత్స చేయనున్నాం. ఆ తర్వాత కూడా వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తార’ని వైద్య సిబ్బంది తెలిపారు. కాగా.. గాయం తీవ్రమైనది కావడంతో అతడిని మళ్లీ ఫీల్డింగ్ చేయనివ్వలేదని, తదుపరి మ్యాచ్‌లకు కూడా స్క్వాడ్ నుంచి తొలగించామని అప్పుడే జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. అంతేకాకుండా ఇప్పుడు ఏకంగా 5 నెలల రెస్ట్ అనడంతో ఐపీఎల్‌తో పాటు టీమిండియా తదుపని ఇంగ్లండ్ టూర్, సౌత్‌ఆఫ్రికా సిరీస్‌లకు కూడా పూర్తిగా దూరం కానున్నాడు.
ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయ్యర్ కెప్టెన్సీలోనే గతేడాది ఫైనల్ వరకు వెళ్లింది. అయితే ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచినా.. అద్భుత పోరాటం చూపి మంచి కెప్టెన్‌గా మార్కులు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు అయ్యర్ దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జట్టులో కెప్టెన్సీ చేయగల సమర్థుల కోసం వెదికి.. చివరికి రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.