క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021 మరో 11 రోజుల్లో ప్రారంభం కానుంది. కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికే బయోబబుల్, నో ఆడియన్స్ వంటి ప్రత్యేక రూల్స్ మధ్య బీసీసీఐ ఈ టోర్నీని నిర్వహించనుంది. అయితే వీటికి తోడు ఆటలోనూ మరికొన్ని సరికొత్త రూల్స్ చేర్చినట్లు తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ సారి ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ ఉండడానికి వీల్లేదు. మ్యాచ్ కచ్చితంగా 3 గంటల్లో ముగిసిపోవాల్సిందే. ఒక ఇన్నింగ్స్‌లో నిర్ణీత 20 ఓవర్లు 90 నిముషాల్లో పూర్తి చేయాల్సిందే. ఇంగ్లండ్-ఇండియా టీ20 అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ వల్ల స్కై అవుటైన తీరు అప్పట్లో దుమారం రేపింది. దీంతో ఈ విధానాన్ని కూడా ఈ ఐపీఎల్‌లో తొలగించారు. అనుమానాస్పద అవుట్‌ల విషయంలో డెసిషన్ పూర్తిగా థర్డ్ అంపైర్ చేతిలోనే ఉంటుంది.
ఇక గత ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ విషయంలో షార్ట్ రన్ కూడా చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అందుకే ఈ టోర్నీలో కచ్చితంగా షార్ట్ రన్‌పై దృష్టి పెట్టాలని బీసీసీఐ అనుకుంటోంది. దానికోసం థర్డ్ అంపైర్‌కే ఈ బాధ్యత కూడా అప్పగించింది. ఇప్పటికే బౌలర్ వేసే ఫ్రంట్ ఫుట్ నోబాల్ విషయంలో థర్డ్ అంపైర్ ప్రతి బంతినీ చెక్ చేసేలా ఐసీసీ ఓ రూల్ తీసుకొచ్చింది.
గతంలో ఏదైనా మ్యాచ్ స్కోర్లు సమం అయితే ఓ సూపర్ ఓవర్ ఆడించేవారు. మళ్లీ టై అయితే.. ఇంకో ఓవర్, అలా విజేత తేలే వరకు ఓవర్లు పడుతూనే ఉండేవి. అయితే ఈ సారి ఆ విధానానికి స్వస్తి చెప్పారు. నిర్ణీత 20 ఓవర్ల కోటా అంటే 40వ ఓవర్ ఆఖరి బంతి ముగిసే సమయం నుంచి గంట లోపు సూపర్ ఓవర్లు పూర్తయిపోవాలి.