ఇండియన్ ప్రీమియన్ లీగ్ 2021 వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ మొత్తం బయోబబుల్ వాతావరణంలో జరగనుంది. అలాగే తటస్థ వేదికల్లో జట్లు మ్యాచ్‌లు ఆడనున్నాయి. అలాగే స్టేడియంలలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరగనున్నాయి. గత ఏడాది కూడా ఇలాంటి వాతావరణంలోనే ఐపీఎల్ జరిగినా అది వేరే దేశంలో కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఈ సారి స్వదేశంలో టోర్నీ జరుగుతున్నా ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోవడం అభిమానులకు కొంత బాధ కలిగిస్తోంది.
అయితే ఈ టోర్నీలో పాల్గొనబోతున్న ఆటగాళ్లంతా కచ్చితంగా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ క్వారంటైన్ పిరియడ్‌లో వారందరికీ పలుసార్లు కరోనా టెస్ట్ చేస్తారు. అందులో వరుసగా 3 సార్లు నెగటివ్ వచ్చిన ఆటగాళ్లను మాత్రమే మ్యాచ్‌లు ఆడడానికి అనుమతించనున్నారు. బయో బబుల్‌లో వాతావరణంలోనే మ్యాచ్‌లు ఆడాలి. అయితే ఈ నిబంధన నుంచి ముంబై ఆటగాళ్లు తప్పించుకున్నారు.
ఇంగ్లండ్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లంతా బయో బబుల్ వాతావరణంలోనే మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ జట్టులో ముంబై స్టార్ ఆటగాళ్లు చాలా వరకు టీమిండియాలో ఉన్నారు. వీరంతా నేరుగా ఆ బయోబబుల్ నుంచి ముంబైకు చేరుకుని ఇక్కడి శిబిరంలోకి చేరిపోయారు. దీంతో ఇక్కడ ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేకుండా వారంతా తప్పించుకున్నారు. వీరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ బ్రదర్స్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో పాటు స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.