దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రతి రోజూ లక్షల మందిని కబళిస్తోంది. వేల మంది ఉసురు తీస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో భాగంగానే రాజస్థాన్‌లో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇంతకుముందే రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను విధించింది. అయితే ఈ కర్ఫ్యూను మరిన్ని రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మే 17 వరకూ కర్ఫ్యూ కొనసాగనుందని ప్రకటించింది. దీనితో పాటు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అందులో కొత్త నిబంధనలను కూడా పొందుపరిచింది.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన నిబంధనల ప్రకారం.. రాష్ట్రం వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అనవసరంగా రోడ్ల మీదకు ఎవరు వచ్చినా.. వారిని అక్కడిక్కడే అదుపులోనికి తీసుకోవడం జరుగుతుంది. వారికి అక్కడికక్కడే వైద్యులు కరోనా టెస్టులు చేస్తారు. ఒకవేళ వారికి పాజిటివ్ రిపోర్టు వస్తే, వెంటనే 15 రోజుల పాటు క్వారంటైన్ చేయనున్నారు. కర్ఫ్యూ కొనసాగే సమయంలో అన్ని మార్కెట్లను మూసివేయనున్నారు. వాటితో పాటు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు కూడా మూసేయాల్సి ఉంటుంది. వివాహాది శుభాకార్యాలకు 31మంది బంధువులకు మించి హాజరు కాకూడదు. అంతేకాదు ఆ వేడుకను కేవలం 3 గంటల వ్యవధిలో ముగించాల్సి ఉంటుంది. బ్యాండ్-బాజాలతో ఎట్టిపరిస్థితుల్లోనూ సందడి చేయకూడదు. ఇదే విధంగా ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు కేవలం మెడికల్ ఎమర్జెన్సీ వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఇక రెస్టారెంట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా తెరిచేందుకు అనుమతి లేదు.
ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్నింటిలో ఇప్పటికే నైట్ కర్ఫూలు అమలులో ఉన్నాయి. మరి కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా లాక్‌డౌన్ పెట్టడంపై కూడా ఆలోచన చేస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం ఈ లాక్‌డౌన్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.