Sunday, March 22, 2026

నాపై అలాంటి వార్తలు రాయకండి.. అదంతా అబద్ధం: భువి

టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ ప్రత్యర్థులను బెంబేతెత్తిండం భువీకి వెన్నతో పెట్టిన విద్య. నకుల్‌ బాల్స్‌, స్ట్రైట్ యార్కర్స్‌తో బ్యాట్స్‌మన్‌ను ముప్పుతిప్పలు పెట్టడం భువీ ప్రత్యేకత. ప్రధానంగా పరుగులను అడ్డుకుంటూ పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ కీలక సమయాల్లో వికెట్లు తీయగల అత్యంత నమ్మదగిన బౌలర్లలో భువీ స్థానం ప్రధానంగా ఉంటుంది. ముఖ్యంగా డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా భువీకి మంచి పేరుంది.

ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భువీని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. వాస్తవానికి ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి దేశాలు భువీ బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతాయి. అయితే భువీ పరిమిత ఓవర్లు, టీ20ల్లో దృష్టి పెట్టేందుకే టెస్టులకు దూరమవుతున్నట్లు సోషల్‌ మీడియాలో రూమర్లు వచ్చాయి. దీనిపై భువీ స్వయంగా తన ట్విటర్‌ ద్వారా స్పందించాడు.

” టీమిండియాకు 3 ఫార్మాట్లలో ఆడడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. నా దృష్టిలో టెస్ట్ క్రికెట్‌కే మొదటి ఓటు ఉంటుంది. వన్డే, టీ20లపై దృష్టి పెట్టేందుకే నేను టెస్టులు ఆడడం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఏ బౌలర్‌ అయినా సరే.. సంప్రదాయ క్రికెట్‌కే మొగ్గు చూపుతాడు. ఒక బౌలర్‌కు తన బౌలింగ్‌లో వైవిధ్యం ఎక్కువగా చూపించే అవకాశం టెస్టుల్లోనే లభిస్తుంది. అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్‌ కంటే టెస్టులు ఆడేందుకే నేను ఇష్టపడతా. కేవలం ఊహాగానాల ఆధారంగా నాపై అసత్య ప్రచారాలు చేయకండి” అని భువి చెప్పుకొచ్చాడు.

ఇక భారత్ తరఫున భువీ 21 టెస్టులు, 117 వన్డేలు, 48 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 246 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరపున బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్‌లు అద్భుతంగా రాణిస్తూ.. జట్టును ముందుకు తీసుకెళుతుండడంతో భువీకి అవకాశం లేకుండా పోయింది. అయితే ఇన్నాళ్లూ గాయాల కారణంగా జట్టుకు దూరమైన భువి ఇప్పుడు మాత్రం తిరిగి జట్టులోకి ఎంపికయ్యేందుకు తీవ్రంగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మరి అతడిక కష్టానికి తగిన ఫలితం ఎప్పుడు లభిస్తుందో చూడాలి.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -