ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ టీమిండియా ఆటగాళ్లకు బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు ఈ సిరీస్ ఓ అరుదైన రికార్డును అందుకునేందుకు వేదికగా మారింది. ఈ టోర్నీతో పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో కోహ్లీ, రోహిత్ టాప్ ప్లేస్‌కు చేరారు. ఇప్పటివరకు ఏ దేశ ఆటగాడికీ సాధ్యంకాని ఈ రికార్డును వీరిద్దరూ సాధించారు. కోహ్లీ ఏకంగా 3వేల పరుగుల మైలురాయిని దాటగా.. తాజాగా 5వ టీ20తో రోహిత్ కూడా 2,864 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన 5వ టీ20లో కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్.. 34 బంతులాడి 64 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో 2,864 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఇప్పటివరకు అత్యధిక పరుగుల జాబితాలో టాప్ 2లో ఉన్న న్యూజిల్యాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్(2839 పరుగులు) వెనక్కి నెట్టి రోహిత్ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పటివరకు 111 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 2,864 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే విరాట్ 3,103 పరుగులతో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టాప్‌ప్లేస్‌కు చేరాడు. ఈ టోర్నీలో ఇప్పటికే మూడు అర్థ సెంచరీలతో రాణించిన విరాట్ ఈ ఫీట్ సాధించాడు. కాగా.. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన 5వ టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. కొత్త ఓపెనింగ్ జోడీ రోహిత్-కోహ్లీ ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ బౌండరీలు బాదేశారు. చివరి వరకు క్రీజులో ఉన్న కోహ్లీ ఏకంగా 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ 8 వికెట్లకు 188 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవిచూసింది. దీంతో ఇండియా సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది.