5వ టీ20లో టీమిండియా దెబ్బకు ఇంగ్లండ్ విలవిల్లాడింది. తొలుత కొత్త ఓపెనింగ్ జోడీ కోహ్లీ-రోహిత్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. మొదట రోహిత్ శర్మ(64: 36 బంతుల్లో) బౌండరీలతో విధ్వంసం సృష్టించగా.. చివర్లో విరాట్ కోహ్లీ(80 నాటౌట్: 52 బంతుల్లో) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. వీరికి తోడు సూర్యకుమార్ యాదవ్(32), హార్దిక్ పాండ్యా(39) ధాటిగా ఆడడంతో టీమిండియా 224 పరుగులు భారీ స్కోరు చేసింది.
225 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి వికెట్ వెంటనే కోల్పోయినా.. బట్లర్, డేవిడ్ మలాన్ టీమిండియా బౌలర్లపై ఎదురుదాడి చేశారు. రెండో వికెట్‌కు ఏకంగా 130 పరుగుల పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు. అయితే 13వ ఓవర్లో భువీ వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడబోయిన బట్లర్.. అక్కడ పాండ్యాకు చిక్కాడు. ఈ క్రమంలో వికెట్ తీసిన ఆనందంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ వైపు చూస్తూ బట్లర్ ఏదో అన్నడు. దీంతో కోహ్లీ ఆగ్రహంతో అతడివైపు దూసుకెళ్లాడు. బట్లర్ వ్యాఖ్యలకు దీటుగా జవాబిచ్చాడు.
కోహ్లీ మాటలతో బట్లర్ కూడా వెనక్కి తిరిగి ఏదో చెప్పాడు. దానికి కూడా కోహ్లీ కౌంటరిస్తూ అతడి వైపు వెళ్లాడు. దీంతో వివాదం చేయి దాటిపోతుందేమోనని అనుకున్నఅంపైర్లు కలుగజేసుకుని కోహ్లీని నిలువరించి వెనక్కి పంపించివేశారు. దీంతో వివాదం ముగిసింది. బట్లర్ కూడా పెవిలియన్ వైపు వెళ్లిపోయాడు. ఈ వివాదం అనంతరం అంపైర్ నితిన్ మీనన్‌తో కోహ్లి మాట్లాడాడు. తనకు, బట్లర్‌కు మధ్య జరిగిన సంభాషణ గురించి వివరించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అయితే భారత అభిమానులు మాత్రం ‘ఇంగ్లీష్ ప్లేయర్లకు ఆ మాత్రం ఘాటుగా సమాధానం ఇవ్వకపోతే మాట వినరు’ అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.