రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ సూపర్ విక్టరీ సాధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 178 పరుగులు లక్ష్యాన్ని ఊదేసింది. ఈ క్రమంలోనే ఆ జట్టు ఓపెనర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థ సెంచరీతో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ సెంచరీతో కదం తొక్కాడు. 52 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు సాధించి ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన అన్‌క్యాప్‌డ్ ఆటగాడిగా పడిక్కల్ రికార్డు సృష్టించాడు. అలాగే అన్ క్యాప్డ్ ఆటగాళ్లలో సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 2009లో మనీష్ పాండే(114 నాటౌట్), పాల్ వాల్తాటి(120 నాటౌట్)లు మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు వారి సరసన్ పడిక్కల్ చేరాడు. 2009లో మనీష్ పాండు ఈ ఘనత సాధించగా, 2011లో వాల్తాటి ఈ ఫీట్‌ను చేరాడు. సుమారు పదేళ్ల తర్వాత ఒక భారత అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ సెంచరీ చేశాడు.
ఈ క్రమంలోనే పడిక్కల్ సెంచరీ గురించి కోహ్లీ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. పడిక్కల్ సెంచరీ గురించి చెప్పాడు. తమ విజయానికి మరో 16 పరుగులు కావల్సి ఉండగా.. పడిక్కల్‌ను సెంచరీ చేయమని అడిగానని కోహ్లీ తెలిపాడు. ఆ సమయంలో పడిక్కల్ శతకం చేయడానికి 9 పరుగులే కావాలని, ‘సెంచరీ కోసం మేమిద్దరం చర్చించుకున్నాం. నన్ను మ్యాచ్‌ను ఫినిష్ చేయమని చెప్పాడు. నా సెంచరీ గురించి ఆలోచించకుండా మ్యాచ్‌ను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేద్దాం అని పడిక్కల్ అన్నాడు. కానీ నేను అందుకు అంగీకరించలేదు. నీకు ఇది తొలి సెంచరీ. వదులుకోకు అన్నాను. దానికి పడిక్కల్.. ఇలాంటివి చాలా వస్తాయి, కానీ మ్యాచ్‌ను త్వరగా పూర్తి చేద్దాం అన్నాడు. దానికి నేను అంగీకరిస్తూనే ముందు ఈ మైలురాయిని చేరుకోమని సూచించాను. ఈ సెంచరీ పూర్తి చేసుకుని అప్పుడు చెప్పు’ అని అన్నట్లు చెప్పాడు. అంతేకాకుండా సెంచరీ సాధించేందుకు పడిక్కల్ పూర్తి స్థాయి అర్హుడని, అందులో ఎలాంటి సందేహం లేదని కోహ్లీ చెప్పాడు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఆర్సీబీ వికెట్ కోల్పోకుండా 181 పరుగులు జోడించింది. అది కూడా కేవలం 16.3 ఓవర్లలోనే 178 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. దీంతో ఆర్సీబీ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీకి తరపున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా కోహ్లీ-పడిక్కల్ భాగస్వామ్యం నిలిచింది. అంతకుముందు 2013లో క్రిస్ గేల్-దిల్షాన్‌లు నమోదు చేసిన 167 పరుగుల రికార్డును బద్దలు కొట్టింది. కాగా.. 2016లో గేల్-కోహ్లీ కలిసి పంజాబ్ కింగ్స్‌పై నమోదు చేసిన 147 పరుగుల భాగస్వామ్యం ఆర్సీబీ తరఫున మూడో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా ఉంది.
అంతేకాకుండా ఈ సీజన్లో ఓ వికెట్ కూడా కోల్పోకుండా టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. అలాగే ఐపీఎల్ చరిత్రలో వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఒక్క ఓటమి కూడా లేకుండా విజయం సాధించిన ఆర్సీబీ జట్టుగా ఘనత సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరింది.