తమ కెప్టెన్ అంత గొప్పగా పోరాడుతున్నా.. తాను కనీసం అండగా నిలవలేకపోయానంటూ రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం తానో చెత్త ఆటగాడినంటూ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు అతడిని ఓదారుస్తున్నారు. మొదట అతడి ట్వీట్ చూసిన నెటిజన్లు కూడా షాకయ్యారు. కానీ, అతడి బాధ అర్థం చేసుకుని ఓదారుస్తున్నారు. గెలుపోటములు సహజమని, తర్వాతి మ్యాచ్‌లో మరింత గొప్పగా రాణించే సత్తా అతడిలో ఉందని మద్దతుగా నిలుస్తున్నారు. ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడిన రాజస్థాన్ రాయల్స్ చివరి బంతికి ఓటమి చవి చూసింది. మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరు జట్లు బ్యాట్స్‌మన్ మైదానంలో పరుగుల వరద పారించాయి. అయితే చివరి బంతికి రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ అవుట్ కావడంతో పంజాబ్ కింగ్స్‌ను విజయం వరించింది. అయితే కొద్ది సేపటి తరువాత రియాన్ పరాగ్ తాను చేసిన ట్వీట్‌ను తొలగించాడు.
ఇదిలా ఉంటే 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినా రాజస్థాన్ జట్టు అద్భుతంగా పోరాడింది. పంజాబ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించింది. ముఖ్యంగా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్(119: 63 బంతుల్లో.. 12 ఫోర్లు, 7 సిక్సులు) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే అతడికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. బెన్ స్టోక్స్(0), మనన్ వోహ్రా(14), జోస్ బట్లర్(25), శివమ్ దూబే(23), ర్యాన్ పరాగ్(25), రాహుల్ తెవాటియా(2) క్రీజులో ఎక్కవ సేపు నిలబడలేకపోయారు.
— Riyan Parag (@ParagRiyan) April 13, 2021
దీంతో భారమంతా శాంసన్‌పైనే పడింది. అయినప్పటికీ ఒంటరి పోరాటం చేసిన సంజు.. విజయం అంచుల వరకు జట్టును లాక్కొచ్చాడు. అతడు పోరాడిన తీరు అభిమానులను కట్టిపడేసింది. అయితే శాంసన్ సెంచరీతో అదరగొట్టినా రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 217 పరుగులు మాత్రమే చేసి 4 పరుగుల తేడాతో పంజాబ్ ఉత్కంఠ విజయం సాధించింది.