Wednesday, January 22, 2025

‘ఓడినా నీ పోరాటం అద్భుతం.. సంజూ నువ్వో నిజంగా లెజెండ్‌వి’

ఐపీఎల్ 14వ సీజన్‌లో సోమవారం రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు భారీ మజానిచ్చింది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు భారీ స్కోర్లతో కదం తొక్కాయి. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌.. గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. టోర్నీలోనే తొలిసారి 200కు పైగా స్కోరు చేసి రికార్డు సృష్టించింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(91: 50 బంతుల్లో.. 7 ఫోర్లు, 5 సిక్సులు) అదరగొట్టాడు. అతడికి క్రిస్ గేల్(40: 28 బంతుల్లో.. 4 ఫోర్లు, 6 సిక్సులు)లకు తోడు దీపక్ హుడా(64: 28 బంతుల్లో.. 4 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో పంజాబ్ స్కోరు బోర్డు మ్యాచ్ ప్రారంభం నుంచే పరుగులు పెట్టింది. రాజస్థాన్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ రాహుల్, హుడాలు బౌండరీల వర్షం కురిపించారు. వీరిద్దరి విజృంభణతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు తీయగా, ర్యాన్ పరాగ్ ఓ వికెట్ తీసుకున్నాడు.


అనంతరం 222 పరుగుల భారీ స్కోరు లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆరంభం నుంచి అదరగొట్టింది. ముఖ్యంగా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్(119: 63 బంతుల్లో.. 12ఫోర్లు, 7సిక్సులు) బౌండరీలతో మైదానంలో సునామీ సృష్టించాడు. కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చరిత్ర సృష్టించాడు. అయితే అతడికి మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం అందలేదు. దీంతో చివరి వరకు ఒంటరి పోరాటం చేసినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు.


అయితే జట్టు ఓడినా.. కెప్టెన్ సంజు శాంసన్ పోరాటాన్ని మాత్రం నెటిజన్లు విపరీతంగా అభినందిస్తున్నారు. ట్విటర్ వేదికగా.. రకరకాల పోస్టులతో సంజూను ఆకాశానికెత్తేస్తున్నారు. అవెంజర్స్, గ్లాడియేటర్, మిర్చి మువీలో ప్రభాస్, ఖలేజా సినిమాలో మహేశ్.. వంటి పోస్టర్లను సంజు ఫేస్‌తో మార్ఫ్ చేసి ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ‘సంజూ నిజంగా లెజెండ్’ అంటూ కొందరు పొగుడుతుంటే… మరికొందరేమో ‘సంజూ గాడ్ ఇన్నింగ్స్ ఆడాడం’టూ అభినందిస్తున్నారు. ఇంకొందరు‘సోమవారం రాత్రి తాను నిజంగా దేవుడిని చూశానం’టూ ఖలేజా పోస్టర్‌తో రచ్చ చేస్తున్నారు. అయితే మ్యాచ్‌లో పంజాబ్ గెలిచినా.. సెంచరీతో అదరగొట్టిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కడం విశేషం.


ఐపీఎల్‌లో సంజు శాంసన్‌కి ఇది మూడో శతకం. గతంలో 2017, 2019 ఐపీఎల్ సీజన్లలోనూ సంజు శాంసన్ సెంచరీలు నమోదు చేశాడు. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ 102 పరుగులే చేసిన సంజు శాంసన్.. ఈ మ్యాచ్‌లో 119 పరుగులు చేసి.. ఐపీఎల్‌లో కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. అంతేకాదు 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన మొదటి క్రికెటర్‌గా సంజు అరుదైన రికార్డ్ సృష్టించాడు.


సహచరుల నుంచి పెద్దగా మద్దతు లభించకపోయినా.. కెప్టెన్‌గా ఒంటరి పోరాటం చేస్తూ.. చివరి బంతి వరకూ అతను పోరాడిన తీరుపై క్రికెట్ అభిమానులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకున్న సంజు శాంసన్.. ఆ తర్వాత 21 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ని చేరుకున్నాడు. ఆఖరికి 62 బంతుల్లో 119 పరుగులు చేసి 63వ బంతికి బౌండరీ లైన్ వద్ద దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆఖరి బంతికి శాంసన్ అవుట్ కావడంతో పంజాబ్ 4 పరుగుల తేడాతో విజయం కైవసం చేసుకుంది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x