మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోని నల్ల ధనంలో అత్యధిక భాగం స్విస్ బ్యాంకులోనే ఉందనడంలో సందేహం లేదు. ఒక్క మన దేశంలోని నల్ల కుబేరుల ధనమే వేళా కోట్లలో ఉందని అంచనా. అయితే గతేడాది కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడినా.. ఈ ఏడాది సెకండ్ వేవ్ తో భారత్ అల్లకల్లోలం అవుతున్నా.. స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల నల్ల ధనం మాత్రం భారీగా పెరిగిందని సమాచారం. ఈ మేరకు ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు రావడం సంచలనమైంది.
స్విస్ బ్యాంకుల్లో 2019 చివరి నాటికి రూ. 6,625 కోట్లు (సీహెచ్ఎఫ్ 899 మిలియన్)గా ఉన్న భారతీయుల సొమ్ము 2020 చివరి నాటికి రూ. 20,700 కోట్లు (సీహెచ్ఎఫ్ 2.55 బిలియన్)కు చేరుకుందని, రెండేళ్లుగా ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉన్నప్పటికీ నిధులు ఈ స్థాయిలో పెరగాయని, గత 13 ఏళ్లగా డిపాజిట్ అవుతున్న దానికంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో నిధులు జమ అయ్యాయనేది ఆ వార్తల సారాంశం.
అయితే ఈ వార్తలను భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. వీటికి ఎలాంటి ఆధారాలు లేవని, నిజానికి ఈ రెండేళ్లలో స్విస్
నేషనల్ బ్యాంక్ (ఎన్ఎన్‌బీ)కి బ్యాంకులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖాతాదారుల డిపాజిట్లు క్షీణించాయని తెలిపింది. వారంతా బాండ్లు, సెక్యూరిటీల రూపంలోను, ఇతర ఆర్థిక విధానాల్లో జమ చేస్తూ వస్తున్నారని వివరించింది.
ఇక స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం డిపాజిట్ అయిందనేది నిజం కాదని, ఇంకా చెప్పాలంటే డిపాజిట్ అయిన మొత్తం భారతీయులది, ఎన్నారైలది కాదని, ఆ సొమ్ము ఇతర దేశాలకు చెందిన వారిదని కేంద్రం వివరించింది.