ఇంగ్లండ్-ఇండియా మధ్య జరిగిన తొలి వన్డే మొత్తం గాయాల మయంగా మారింది. టీమిండియా ఆటగాలో కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ గాయపడగా.. అయ్యర్ గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అలాగే ఇంగ్లీష్ ఆటగాళ్లు శామ్ బిల్లింగ్స్, కెప్టెన్ మోర్గాన్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇంగ్లండ్ బ్యాటింగ్ సమయంలో మోర్గాన్ చేతికి మూడు కుట్లు వేయించుకుని మరీ బ్యాటింగ్‌కు వచ్చాడంటే గాయం తీవ్రత అర్థం చేసుకోవచ్చు. దీంతో వీరంతా రెండో వన్డేలో ఉంటారా..? లేక ఇరు జట్లు కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగాల్సిందేనా..? అనే అనుమానాలు ప్రస్తుతం కలుగుతున్నాయి.
ఇక టీమిండియా విషయానికి వస్తే.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా.. ఫీల్డింగ్ చేస్తూ బంతిని ఆపేందుకు శ్రేయస్ డైవ్ చేశాడు. ఈ క్రమంలోనే అతడి ఎడమ చేతి భుజానికి బలంగా గాయమైంది. దీంతో అయ్యర్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అతడిని మెడికల్ సిబ్బంది వెంటనే మైదానం నుంచి తీసుకెళ్లారు. అనంతరం అతడికి వైద్య పరీక్షలు, స్కానింగ్ నిర్వహించారు. రిపోర్టులు రావల్సి ఉంది. గాయం తీవ్రత దృష్ట్యా అయ్యర్ తదుపరి మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. అయ్యర్ గాయంపై బీసీసీఐ ఎలాంటి అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఒకవేళ మిగిలిన రెండు వన్డేలకు అయ్యర్ దూరమైతే సూర్యకుమార్ యాదవ్‌కు తుది జట్టులో స్థానం లభిస్తుంది. టీ20ల్లో జోరు వన్డేల్లో కూడా స్కై కొనసాగిస్తాడేమో చూడాలి.
కాగా.. రోహిత్ కూడా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ బౌలర్ మార్క్ ఉడ్ వేసిన బంతి నేరుగా అతడి భుజానికి తాకడంతో విలవిల్లాడిపోయాడు. మైదానంలోనే రెండు సార్లు చికిత్స తీసుకుని బ్యాటింగ్ కొనసాగించినా.. బ్యాటు ఝుళిపించలేకపోయాడు. 28 పరుగులు వద్ద అవుటై మైదానాన్ని వీడాడు. రెండో ఇన్నింగ్స్ మొత్తం ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. ఇక ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ శామ్ బిల్లింగ్స్, కెప్టెన్ మోర్గాన్ కూడా ఫీల్డింగ్ సమయంలో తీవ్రంగా గాయపడ్డారు. మోర్గాన్ ఏకంగా చేతి వేలికి మూడు కుట్లు వేయించుకుని బ్యాటింగ్‌కు వచ్చాడు.