మంగళవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 317 పరుగులు భారీ స్కోరు చేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్(98) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నా.. విలువైన పరుగులు చేశాడు. కోహ్లీ కూడా అర్థ సెంచరీతో రాణించాడు. చివర్లో రాహుల్(62) క్లాసికల్ ఇన్నింగ్స్‌కు తోడు కృనాల్ పాండ్యా(58) చెలరేగడంతో చివరి 10 ఓవర్లలో ఏకంగా 115కు పైగా పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు అద్భుతమైన ఓపెనింగ్ దక్కింది. జేసన్ రాయ్(46), జానీ బెయిర్ స్టో(94) బౌండరీల మోత మోగించారు. కానీ వారిద్దరి తరువాత మరెవ్వరూ కనీస పోరాటం చూపలేకపోయారు. 42.1 ఓవర్లలోనే ఆలౌటై మ్యాచ్ చేజార్చుకున్నారు. దీంతో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయం సాధించడమే కాకుండా సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది.
తొలి వన్డేలో విజయం సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. తాము గెలిచిన అన్ని మ్యాచ్‌లలో ఇదే ప్రత్యేకమైందని, జట్టులోని ఆటగాళ్లు తన నమ్మకం నిలబెట్టారని అన్నాడు. తామ ఆటగాళ్లు తిరిగి పుంజుకోవడం ఆనందంగా ఉందని, వారిపై తాను పెట్టుకున్న నమ్మకం వృథా కాలేదని అన్నాడు. ‘ఇంగ్లండ్‌పై తొలి వన్డేలో సాధించిన విజయం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ మధ్య కాలంలో ఇదే గొప్ప విజయం. మరే గెలుపూ దీనికి సాటి రాదు. ఈ విజయం తనకు ఎంతో గర్వంగా ఉంది. శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్ నమ్మకాన్ని నిలబెట్టారు. అద్భుతంగా రాణించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించార’ని కోహ్లీ పేర్కొన్నాడు. అంతేకాకుండా ధవన్ ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉంటాడని, అతడిలో అదే తనకు నచ్చుతుందని అన్నాడు.
‘తుది జట్టులో చోటు లభించకపోయినా ధవన్ చాలా ఉత్సాహంగా ఉంటాడు. నిరాశ అంటే అతడికి తెలియదు. నిజానికి మ్యాచ్‌లో ధవన్ చేసిన 98 పరుగులు జట్టుకు ఎంతో విలువైనవో మాటల్లో చెప్పలేను. స్కోరు బోర్డులో కనిపించిన అంకెల కంటే వాటి విలువ ఎంతో ఎక్కువ’ అని కోహ్లీ అన్నాడు. రాహుల్ కూడా నమ్మకం నిలబెట్టుకున్నాడని, జట్టుకు అవసరమైనపుడు విలువైన పరుగులు చేశాడని కోహ్లీ అభినందించాడు. టీమిండియాలో అందరూ అద్భుతంగా రాణిస్తున్నారని, రెండో వన్డేలో కూడా ఇదే తరహా విజయం సాధించాలని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు. కాగా.. గురువారం రెండో వన్డే జరగనుంది.