పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నందిగ్రామ్ నియోజకవర్గంలోని బోయల్ పోలింగ్ కేంద్రంలో అవకతవకలు జరిగాయని.. అసలైన ఓటర్లను రానివ్వకుండా బయటి వాళ్లు దొంగ ఓట్లు వేశారని దీదీ సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. మమతా ఆరోపణలన్నీ నిరాధారమైనవని.. అంతేకాదు ఏప్రిల్-01 న ఆమె చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవమే అని ఎన్నికల కమిషన్ కొట్టిపారేసింది. పోలింగ్ బూత్ వద్ద దీదీ ఎంత హంగామా సృష్టించారో మీడియాలో ప్రసారమైన వీడియోలే చెబుతున్నాయని ఎన్నికల సంఘం కౌంటరిచ్చింది. అంతేకాదు.. బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఎన్నికల సంఘం, పారామిలటరీ బలగాలపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారని కమిషన్ మండిపడింది.
అంతా సజావుగానే..
మీరు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి.. ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మీ పద్ధతితో ఓటర్లు ప్రలోభానికి గురయ్యే ప్రమాదముంది. ఇతర రాష్ట్రాల ఎన్నికలపైనా మీ మాటల ప్రభావం పడే ముప్పుంది. అందుకే ఎన్నికల కోడ్ ఆధారంగా మీపై చర్యలు తీసుకునే విషయంపై నిర్ణయం తీసుకుంటాం’ అని ఎన్నికల సంఘం చెప్పుకొచ్చింది. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం మంచిది కాదని.. నందిగ్రామ్ లో ఎన్నికలు ప్రశాంతంగానే.. ఎలాంటి గొడవలు లేకుండానే సజావుగానే జరిగాయని తెలిపింది. మరి ఎన్నికల కమిషన్‌పై దీదీపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వీడియో వైరల్..
కాగా.. మమతా బెనర్జీ కాలికి కొన్నిరోజుల క్రితం గాయమైన విషయం విదితమే. దీంతో వీల్‌చైర్‌లోనే దీదీ ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య ప్రచారం చేసిన సభల్లో ఆమె.. గాయమైన కాలిని ఊపుతూ ఉన్న వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోలను బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి కాలికి గాయమై అంత పెద్ద కట్టుకోవాల్సి వస్తే దాన్ని కదపకూడదు కానీ.. నెట్టింట్లో వైరల్ అయిన వీడియోలో మమతా మాత్రం గాయమైన కాలిని ఊపుతూ కనిపించడం గమనార్హం. అంతేకాదు.. ఓ కాలిని మరో కాలిపై వేసుకుని మరీ కూర్చుని కాలు ఊపడమేంటి..? ఇదంతా దీదీ చేస్తున్న డ్రామా అని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అటు ఎన్నికల కమిషన్.. ఇటు బీజేపీ నేతలు తీవ్ర విమర్శలతో బెంగాల్‌లో ఫలితాలు ఎలా ఉంటాయో.. ఏంటో అని దేశం మొత్తం సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.