న్యూఢిల్లీ: అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఐపీఎల్ 14వ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్లు తమ మొదటి మ్యాచ్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. అయితే గత సీజన్లో దాదాపు రూ. 12.5 కోట్లకు స్మిత్‌ను కొనుగోలు చేసిన రాజస్థాన్ జట్టు సీజన్ ముగిసిన అనంతరం అతడిని రిలీజ్ చేసింది. గత ఏడాది టోర్నీలో స్మిత్ సారథ్యంలో బరిలోకి దిగిన రాజస్థాన్ 14 మ్యాచ్‌లు ఆడగా వాటిలో 6 విజయాలు, 8 ఓటములతో ఇంటి బాట పట్టింది. దాంతో రాజస్థాన్ అతడిని రిలీజ్ చేసి, ఈ సీజన్ లో జట్టు పగ్గాలను శాంసన్ కు అప్పజెప్పింది. అంతేకాకుండా గత సీజన్లో స్మిత్ బ్యాట్స్‌మన్‌గానూ రాణించలేదు. గతేడాది ఐపీఎల్లో స్మిత్ ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 311 పరుగులు నమోదు చేశాడు.
కాగా ఈ ఏడాది ఢిల్లీ జట్టు స్మిత్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఐపీఎల్లో స్మిత్ అందరినీ ఆకట్టుకుంటాడని, తన ఫామ్ మళ్లీ అందుకుంటాడని పాంటింగ్ చెప్పారు. అంతేకాకుండా మరెన్నో ఆసక్తికర విషయాలను తెలిపాడు. “ఇటీవల చెన్నైలో జరిగిన మినీ వేలంలో స్మిత్‌ను రూ. 2.2 కోట్లకే మా జట్టు దక్కించుకుంది. ఇంత తక్కువ ధరకే మేం స్మితీని దక్కించుకుంటామని అనుకోలేదు. చాలా కాలంగా అతడిని కొనసాగించిన ఫ్రాంఛైజీ ఈఏడాది అతడిని వదులుకుంది. ప్రస్తుతం అతడు ఆట మీద కసితో ఉన్నాడు. ఈ సీజన్లో స్మిత్ కచ్చితంగా పరుగుల వరద పారిస్తాడు. తన ఫామ్ తిరిగి సంపాదించి తనేంటో నిరూపించుకుంటాడ”ని పాంటింగ్ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఇక్కడ చెన్నైలో వేలం జరుగుతున్న సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని పాంటింగ్ చెప్పారు. అయినా ఫ్రాంఛైజీ యజమానులతో ఆరోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నానని, ఇంతలో స్మిత్ కోసం బిడ్ వేసినట్లు తెలిసిందని, వెనువెంటనే డీసీ అతడిని కొనుగోలు చేసిందనే వార్త అందిందని చెప్పారు. స్మిత్‌ను మా జట్టు సొంతం చేసుకుందని తెలియగానే ఎంతో ఆనందంగా అనిపించింది. స్మిత్ అనుభవం, అతడి ఆటతీరూ మా జట్టుకు ప్రయోజనం చేకూరుస్తాయని పాంటింగ్ అన్నారు. అయితే స్మిత్‌ను రాజస్తాన్ రాయల్స్ రిలీజ్ చేయడంతో అతడి కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడ్డాయి. డీసీ అతడిని సొంతం చేసుకుంది. ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 10న జరగనుంది.