న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-14 సీజన్ ప్రారంభానికి సర్వం సిద్దమయింది. అన్ని దేశాల ఆటగాళ్లు కూడా భారత్ చేరి రానున్న మ్యాచ్‌ల కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఖాళీ సమయాల్లో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఇదేవిధంగా ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ ఇటీవల అభిమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2014 ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న క్షణాలు తనకెంతో ప్రత్యేకమని అన్నాడు. అంతేకాకుండా కేకేఆర్ కు తను ఆడిన తొలి సీజన్‌లో ట్రోఫీ అందుకోవడం పట్టలేని సంతోషాన్నిచ్ఛిందని చెప్పాడు. అయితే ఇటీవల జరిగిన మినీ వేలంలో కమిన్స్ మళ్ళీ కేకేఆర్ గూటికి చేరాడు. కేకేఆర్ తరపున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన కమిన్స్‌ను 2017లో ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో తాజా సీజన్‌లో మరోసారి కేకేఆర్ అతడిని రూ. 15 కోట్లకు సొంతం చేసుకుంది.
మళ్లీ కేకేఆర్ తో చేరడం ఎలా ఉందని అభిమానులు అడగడంపై కమిన్స్ స్పందించాడు. అభిమానులతో అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ‘‘2014లో కప్పు గెలవడంతో పాటు గంభీర్ సారథ్యంలో ఆడటం మరో మధుర జ్ఞాపకం. ఒక కెప్టెన్‌గా గంభీర్ ఎప్పుడూ దూకుడుగానే ఉండేవాడు. అతడి సారథ్యంలో ఆడటాన్ని నేను ఎంతగానో ఆస్వాదించాను. మేం ట్రోఫీ గెలిచిన మరుసటి రోజు లక్షల మంది అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆ క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేన’’ని కమిన్స్ అన్నాడు.
ఇదిలా ఉంటే ఐపీఎల్-2020 సీజన్‌లో సన్ రైజర్స్ తరపున ఆడిన కమిన్స్ తొలుత నిరాశపరిచినా, ఆ తరువాత తనదైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశాడు. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన కమిన్స్ 12 వికెట్లు తీసి తనేంటో నిరూపించుకున్నాడు. కాగా.. ఈ సీజన్‌లో కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుండడం గమనార్హం. ఈ మ్యాచ్ 11న జరగనుంది.