చెన్నై: విమర్శకులకు కేకేఆర్ అదిరిపోయే సమాధానం ఇచ్చింది. తమ ఆటగాళ్లను అవహేళన చేస్తే ఊరుకునేది లేదనే స్థాయిలో కౌంటర్ ఇచ్చి విమర్శకుల నోర్లు మూయించింది. భారత యువ ఆటగాడు, కేకేఆర్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ను లక్ష్యంగా చేసుకుని వస్తున్న విమర్శలపై కేకేఆర్ స్పందించింది. గతేడాది ఆసీస్ తో జరిగిన టెస్టు సిరీస్‌లో శుభ్ మన్ అద్భత ప్రదర్శన కనబరిచాడు. తనదైన ఆటతీరుతో అందరినీ మెప్పించాడు. ముఖ్యంగా గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గిల్ 91 పరుగులతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంత్ దూకుడైన ఇన్నింగ్స్ ముందు గిల్ ఆట చిన్నదిగా కనిపించినా.. జట్టు గెలుపుతో అతడు కూడా కీలక పాత్ర పోషించాడు.
కానీ కంగారూలపై చూపించిన దూకుడును గిల్ ఇంగ్లండ్ పై కనబరచలేదు. ఇక మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో గిల్ కేకేఆర్ తరపున ఆడనున్నాడు. కేకేఆర్ ప్రధాన బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. గత సీజన్‌లో కేకేఆర్ తరపున 14 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 440 పరుగులు చేశాడు. అంతేగాక వరుసగా మూడు సీజన్లలో కేకేఆర్ తరపున 200 పరుగులకు పైగా సాధించాడు.
కానీ ఇటీవల టెస్టులు మాత్రమే ఆడిన గిల్ పై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ”ఇన్నాళ్లూ టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్నావు. టీ20 మ్యాచ్‌లో ఎలా ఆడాలో తెలుసా..? అని కొందరంటే, మరికొందరేమో వరుసగా టెస్టు మ్యాచ్‌లు ఆడావు.. ఐపీఎల్ ఆడేందుకు టెస్టు మ్యాచ్ అనుభవం ఏం పనికొస్తుంది?, టెస్టు మ్యాచ్‌లో భారీ షాట్లు ఆడేందుకు వీలుండదు. మరి ఆ ప్రాక్తీస్ తో ఈసారి ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించగలవా” అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు కౌంటర్ గానే కేకేఆర్ తాజా వ్యాఖ్యలు చేసింది.
అంతేకాకుండా ప్రాక్టీస్ లో భారీ షాట్లతో పాటు క్లాసిక్ షాట్లతో బౌలర్లను బెదరగొడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘గిల్ పర్‌ఫెక్ట్‌గానే ఉన్నాడు.. ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు..’ అంటూ విమర్శకుల నోటికి తాళం వేసింది. కాగా.. ఈ సీజన్‌లో కేకేఆర్ తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 11న చెన్నై వేదికగా జరగనుంది.