చెన్నై: ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్ లో టీమిండియా అద్భుతంగా ఆడి చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. సీనియర్లంతా జట్టుకు దూరమైనా కుర్రాళ్ళు చెలరేగి చరిత్ర సృష్టించారు. కనీస అంతర్జాతీయ అనుభవం లేని యువ ఆటగాళ్లు సమష్టిగా రాణించి పటిష్టమైన ఆస్ట్రేలియాను మట్టి కరిపించారు. ఈ విజయంలో టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
ఆ సిరీస్ నుంచి పంత్ మంచి ఫామ్ అందుకున్నాడు. పంత్ క్రీజ్ లో ఉన్నాడంటే విజయం మనదే అనేంతలా అభిమానులను ఆకట్టుకున్నడు. అయితే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలను ఫ్రాంచైజీ యాజమాన్యం పంత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. శ్రేయాస్ అయ్యర్ గాయంతో ఐపీఎల్ 14వ సీజన్‌కు దూరం కావడంతో ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది అయ్యర్ సారధ్యంలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచి అదరగొట్టింది. కానీ ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఒడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఇదిలా ఉంటే ఇటీవల బ్యాటింగ్, కీపింగ్ తో దుమ్మురేపుతున్న పంత్ కు కెప్టెన్సీ అందిచడంతో జట్టులోనూ కొత్త ఉత్సాహం మొదలైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం పంత్ ప్రాక్టీస్ వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో మొదట పంత్ తన జట్టు సభ్యులతో కరచాలనం చేసి మైదానంలోకి దిగాడు. అనంతరం తన స్టైల్ షాట్లతో ప్రాక్టీస్ సెషన్లో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేరిన జట్టు యాజమాన్యం.. ‘కెప్టెన్ ఆగయా, పంత్ ఆన్ ఫైర్, మ్యాన్ ఆన్ మిషన్’ అంటూ రకరకాల క్యాప్షన్స్ జత చేసి పోస్ట్ చేసింది. ప్రస్తుతం పంత్ వీడియో సోషల్ మీడియాలో వైర్క్ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు కూడా పంత్ ను అభినందిస్తూ కామెంట్ల చేస్తున్నారు.
కాగా.. ఐపీఎల్‌లో 68 మ్యాచ్‌లు ఆడిన పంత్ 2079 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్‌లో పంత్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 10న ముంబై వేదికగా జరగనుంది. ఈ మ్యచ్ లో పంత్ కెప్టెన్సీ ప్రతిభ ఎంతో కూడా తెలిసిపోతుంది.