ఇంగ్లండ్ క్రికెట్లో పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఎలాంటి బౌలర్ అనే విషయం వేరే చెప్పక్కర్లేదు. ఇంగ్లండ్ పేసర్లలో 500 వికెట్లు తీసిన టాప్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ కూడా ఒకరు. 146 టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన బ్రాడ్ 517 వికెట్లు పడగొట్టాడు. కెరీర్లో 10 వికెట్ల మార్క్‌ను 3 సార్లు, 5 వికెట్ల మైలురాయిని 18 సార్లు అందుకున్నాడు. టెస్టుల్లో బ్యాట్‌తో కూడా రాణించాడు. అతని కెరీర్‌లో సెంచరీతో పాటు 13 అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. కానీ తాను ఇన్ని మ్యాచ్‌లు ఆడినా.. ఇన్ని వికెట్లు తీసినా ఓ వ్యక్తి నుంచి మాత్రం తనకు ఇప్పటికీ సరైన గుర్తింపు లభించలేదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ జట్టు తరపున ఎన్నో కీలక మ్యాచ్‌లు ఆడానని, అందులో అనేకసార్లు గొప్ప ప్రదర్శనలు చేశానని, కానీ ఇంగ్లండ్ అండ్ వేల్స్(ఈసీబీ) మాజీ సెలెక్టర్ ఎడ్ స్మిత్ మాత్రం తనను ఓ ఆటగాడిగా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇంగ్లండ్ గడ్డపై త్వరలో జరుగనున్న వరుస టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో బ్రాడ్ మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలోనే గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌కు సంబంధించి కూడా బ్రాడ్ వివరించాడు. తొలి టెస్టు తుది జట్టులో తన పేరు లేకపోవడం తనకు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని, అ తరువాత దానికి గల కారణాలు తెలుసుకొని షాక్‌కు గురయ్యానని చెప్పుకొచ్చాడు. రొటేషన్ పద్ధతి నేపథ్యంలో తన వంతు వచ్చినప్పుడల్లా.. జట్టులో ఉంటానని తాను అనుకున్నా.. అనూహ్యంగా తనను ఎంపికయ్యేవాడిని కాదని, దాంతో చాలా బాధపడేవాడినని బ్రాడ్ చెప్పాడు.
స్మిత్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో రొటేషన్ పద్ధతిని చూపిస్తూ తనను ఉద్దేశపూర్వకంగా తప్పించాడని ఆరోపించాడు. త్వరలో జరుగనున్న అన్ని టెస్టుల్లోనూ తనకి ఆడాలని ఉందని, కానీ జట్ులో ఉంటానో లేదో తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఈ వేసవిలో న్యూజిలాండ్, భారత్ జట్లతో ఇంగ్లండ్ వరుస టెస్ట్ సిరీస్‌లు ఆడబోతోంది. అందులోనూ 7 టెస్టులు ఆడబోనుంది. అందులో జూన్ 2న లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టు జరగనుంది. జూన్ 10న బర్మింగ్‌హామ్‌లో రెండో టెస్టు జరగనుంది. ఆ తర్వాత భారత్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకు 5 టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.