కంగారూ గడ్డపై యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. రాహుల్ గాయం, పృధ్వీషా పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం పొందిన గిల్.. అద్భుతంగా రాణించాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా స్థానం సంపాదించాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లడిన గిల్.. ఆసీస్ సిరీస్ గురించి గిల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆస్ట్రేలియాలో అరంగేట్ర మ్యాచ్‌లో తొలిసారిగా మైదానం అడుగుపెడుతుంటే.. యుద్ధభూమిలోకి అడుగుపెడుతున్నట్లు అనిపించిందని గిల్ అన్నాడు.
‘ఆసీస్‌పై రెండో టెస్టులో ఫీల్డింగ్ చేసేంతవరకు సాధారణంగానే ఉన్నా. చివరికి మేం బ్యాటింగ్‌కు దిగినప్పుడు, డ్రెస్సింగ్ రూమ్ నుంచి పిచ్ వద్దకు నడుస్తున్నప్పుడు, అభిమానులు అరుస్తున్నప్పుడు.. వింతగా అనిపించింది. ఏదో యుద్ధానికి వెళ్తున్న అనుభూతి కలిగింది. ఇక కోచ్ రవిశాస్త్రి జట్టుతో మాట్లాడారు. ఆ తర్వాత నాకు టోపీ ఇచ్చారు. టోపీ అందుకోగానే నాలో కలిగిన అనుభూతిని వర్ణించలేను. నేను ఆ ఫీలింగ్‌లో ఉండగానే టాస్ వేశారు. ఫీల్డింగ్‌కు వెళ్లిపోయాం’ అని గిల్ అప్పటి విషయాలను గుర్తు చేసుకొన్నాడు.
ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచుల్ని చూడడానికి ఉదయాన్నే 4:30 గంటలకు నిద్రలేచేవాడినని, అదే ఆసీస్‌పై తన ఆటను చూసేందుకు అభిమానులు నిద్రలేస్తారని అనిపించడం వింతైన అనుభూతి కలిగించిందని అన్నాడు. ఆసీస్ సిరీసులో 259 పరుగులు చేసిన గిల్ టీమిండియా 2-1తో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా.. ఇప్పటివరకు భారత్ తరపున మొత్తం 7 టెస్టుల్లోనే ఆడిన.. గిల్ టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రధానంగా ఆసీస్ సిరీస్‌లో 259 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.