ఇంగ్లండ్ వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు. రాబోయే టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియానే ఫేవరెట్ అని అన్నాడు. టీమిండియాతో 5 టీ20ల సిరీస్ జరగనున్న నేపథ్యంలో బట్లర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా భారత్‌తో జరగబోతున్న టీ20 సిరిస్ గురించి పక్కన పెడితే.. అక్టోబరు లేదా నవంబర్‌లలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టైన టీమిండియానే ఫేవరెట్ అని అభిప్రాయపడ్డాడు. అన్ని ఫార్మాట్లలో కోహ్లీసేన పటిష్ఠంగా ఉందని, టీ20 ఫార్మాట్ కూడా అందుకు మినహాయింపేమీ కాదని అన్నాడు. ప్రస్తుత టీమిండియాను ఓడించడం చాలా కష్టమని, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లో టీమిండియా అదరగొడుతోందని అన్నాడు.
‘మీరు ఒకసారి ప్రపంచకప్ టోర్నీలను పరిశీలించండి. ఆతిథ్య జట్లు మరింత మెరుగ్గా ఆడుతున్నాయని తెలుస్తుంది. అందుకే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. బాగా ఆడుతున్న జట్లు ఇంకా ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా మెగాటోర్నీల్లో ఆతిథ్య జట్లు బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయని, కోహ్లీసేన అన్ని ఫార్మాట్లలోనూ బలంగా ఉంది. టీ20ల్లోనూ అంతే’ అని బట్లర్ పేర్కొన్నాడు.
అంతేకాకుండా ప్రపంచ టీ20 ప్రపంచకప్ ముందు ఇండియాతో ఇండియాలోనే టీ20 జరగడం తమ జట్టుకు కూడా కలిసొచ్చే అంశమేనని బట్లర్ చెప్పాడు. మెగా టోర్నీలోని కీలక మ్యాచ్‌లు అనేకం మొతేరా స్టేడియంలోనే జరుగుతాయని, అలాంటి పిచ్‌లో ఇప్పుడు 5 టీ20లు ఆడడం తమకు కలిసొస్తుందని బట్లర్ అన్నాడు. అయితే ఈ సిరీస్ గెలిస్తే అలా జరిగితే ప్రపంచకప్ ముందు తమ బృందంలో ఆత్మవిశ్వాసం నిండుతుందని, అందుకే ప్రపంచకప్ పరిస్థితుల్లో కోహ్లీసేనతో ఇక్కడ తలపడటం తమకు లభించిన మంచి అవకాశని బట్లర్ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం మొతేరా వేదికగా టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య 5 టీ20ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లోనూ ఎక్కువ మ్యాచ్‌లు ఈ స్టేడియంలోనే నిర్వహించేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తోంది. అంటే తాజాగా జరగబోయే సిరీస్.. రెండు జట్లకు బాగా కలిసొస్తుందన్నమాట. ఈ క్రమంలోనే మొతేరాలో ఎలాగైనా టీ20 సిరీస్ గెలవాలని ఇరు జట్లూ పట్టుదలగా ఉన్నాయి.