క్రికెట్‌లో ఓ భారీ మార్పు జరగబోతోందా..? ఓ సరికొత్త రూల్ రాబోతోందా..? దానివల్ల క్రికెట్ స్వరూపమే మారిపోబోతోందా..? అంటే టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం అండర్ 19 జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ అవుననే అంటున్నాడు. ఇంతకీ ఆ పెను మార్పు ఏంటో తెలుసా..? సింగిల్స్ కనిపించకుండా పోనున్నాయట. క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ సింగిల్స్‌ను తిరస్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌లో గత దశాబ్ద కాలంపైగా సంభవిస్తున్న మార్పులను దీనికి ఉదాహరణగా ద్రవిడ్ చూపించారు.
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో క్రికెట్‌పై నిర్వహించిన చర్చలో పాల్గొన్న ద్రవిడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. బేస్‌బాల్ లాగే క్రికెట్‌కూ అంకెలే ఆధారమని, గత పదిహేనేళ్లలో క్రికెట్‌లో కీలక మార్పులు సంభవించాయని, ముఖ్యంగా ఆటగాళ్ల సగటు విషయాలను పోల్చి చూడడాన్ని పక్కన పెట్టేశామని అన్నారు. ప్రస్తుతం వ్యూహరచన, ఆటగాళ్ల ఎంపికలో డేటా ఉపయోగపడుతోందన్న ద్రావిడ్.. ప్రస్తుతం క్రికెట్ పూర్తిగా బ్యాట్స్‌మన్ గేమ్‌గా మారిపోతోందని, ప్రతి రెండు మూడు బంతులకు ఒక సిక్సర్ బాదే పరిస్థితులు వచ్చేశాయని చెప్పారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లు సింగిల్స్‌ను తిరస్కరించే రోజులు ఎంతో దూరంలో లేవని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే ద్రవిడ్ తన కెరీర్లో టీమిండియా తరపున 164 టెస్టులు, 344 వన్డేలు, ఒక్క టీ20 ఆడాడు. టెస్టుల్లో 52.3 సగటుతో.. 36 సెంచరీలు, 63 అర్థ సెంచరీలతో 13,288 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 71.2 సగటుతో.. 12 సెంచరీలు, 83 అర్థ సెంచరీలతో 10,889 పరుగులు చేశాడు. అలాగే ఆడిన ఏకైక టీ20లో 31 పరుగులు చేశాడు.