వ్యక్తి గొప్పగా బతికినంతకాలం అతడిని అందరూ ప్రశంసల్లో ముంచేస్తారు. కానీ ఒక్కసారి దెబ్బ తిన్నాడంటే చుట్టూ ఉన్న వాళ్లంతా అతడిని విమర్శిస్తారు. దాదాపు 2 ఏళ్లుగా ధోనీ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. 2019 ప్రపంచ కప్ ముగిసినప్పటి నుంచి మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు చేయని సీనియర్లు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే దానికి ధోనీ ప్రదర్శన కూడా ఓ కారణమే. ఒకప్పుడు భారత క్రికెట్ దిగ్గజ ఆటగాడిగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఎంఎస్‌డీ ఇప్పుడు దారుణ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు గతేడాది రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే ఇది అతడికి అంతగా కలిసి రావడం లేదు. గత సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చేశాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఏకంగా ఒక్క పరుగుకే అవుటై విమర్శకులకు మరో అవకాశం ఇచ్చాడు.
ఈ క్రమంలోనే మాట్లాడిన టీమిండియా మాజీ కెప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ మళ్లీ మునుపటిలా ఆడాలంటే అతడు ఓ కీలక మార్పు చేసుకోవాలని సూచించాడు. జట్టులో అతడు బ్యాటింగ్‌కు దిగే స్థానాన్ని మార్చుకోవాలని, అలా చేస్తే ప్రయోజనం ఉండవచ్చని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. చివర్లో వచ్చి ఏదో 4,5 ఓవర్లు ఆడితేనే సరిపోతుందని ధోనీ భావిస్తున్నాడని, కానీ అతడు బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చి.. నిలదొక్కుకొని.. శామ్ కర్రాన్ లాంటి యువ ఆటగాళ్లకు ప్రోత్సాహాన్ని అందించాలని, అప్పుడు అతడితో పాటు జట్టుకూ ఉపయోగకరంగా ఉంటుందని వివరించాడు. మరి గవాస్కర్ సూచనలను ధోనీ ఏ మాత్రం ఫాలో అవుతాడో చూడాలి.
ఇదిలా ఉంటే గతేడాది సీజన్లో ధోనీ మాత్రమే కాదు.. చెన్నై జట్టంతా దారుణంగా ఆడింది. అన్ని విభాగాల్లో ఘోర ప్రదర్శన చేసి గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి సెమీస్ కూడా చేరకుండా ఇంటిదారి పట్టింది. అయితే ఆ ప్రదర్శన నుంచి ఎంతో కొంత నేర్చుకుని చెన్నై ఈ ఏడాది బాగా ఆడుతుందని, అంచనాలను అందుకుంటుందని అంతా భావించారు. ధోనీ కూడా మళ్లీ అద్భుతంగా ఆడతారని అభిమానులు భావించారు. కానీ.. ధోనీ మళ్లీ నిరాశపరిచాడు.