చెన్నై: ఐపీఎల్ 14 సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు సంజు శాంసన్. శాంసన్ స్వతహాగా కేరళ ఆటగాడైనా.. దాదాపు 8 ఏళ్లుగా రాజస్థాన్ తరపున ఆడుతున్నాడు. అన్క్యాప్డ్ ప్లేయర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు కెప్టెన్ స్థాయి అందుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శాంసన్ రాజస్థాన్ జట్టుతో తన ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 2013లో అప్పటి సహ ఆటగాడు శ్రీనాథ్‌తో కలిసి రాజస్థాన్ జట్టుకు ఎంపికయ్యానని, 18 ఏళ్ల వయసులో తొలిసారిగా ఐపీఎల్లో అడుగుపెట్టానని శాంసన్ చెప్పాడు. ‘‘తొలి ఐపీఎల్లో అడుగుపెట్టిన రోజు నాకిప్పటికీ గుర్తుంది. ఇంకా మాట్లాడితే నా జీవితంలో అది ఎప్పటికీ మరచిపోలేని రోజు. ట్రయల్స్‌లో పాల్గొంటున్నాను. రెండో రోజు ట్రయల్స్ పూర్తయిన తరువాత అప్పటి రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నా వద్దకొచ్చారు. ‘సంజు.. నీలో చాలా ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. నీవు మా జట్టుకు ఆడితే బాగుటుందని అనుకుంటున్నా. మా ఫ్రాంచైజీ తరపున ఆడతావా..?’ అని అడిగారు. ఆ క్షణం నాకు ఊపిరాగినంతపనైంది. ద్రవిడ్ అంతటి వ్యక్తి నన్ను అడగడంతో వెంటనే ఒప్పుకున్నాను. ఇప్పటకీ నా జీవితంలో అత్యంత గొప్ప రోజు ఏదంటే.. ఆ రోజు గురించే చెబుతానం’టూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
ఇక ఐపీఎల్ తనకు ఎంతో ఇచ్చిందని, ఇన్నేళ్లుగా ఐపీఎల్లో కొనసాగడం చాలా ఆనందంగా ఉందని శాంసన్ చెప్పాడు. ఇప్పటివరకు తాను సాధించింది కానీ, ఇక ముందు సాధించబోయే దానితో కానీ చాలా ఆనందంగా ఉన్నానని, ఇంతకంటే తనకేం అవసరం లేదని చెప్పాడు. తన కెరీర్ ఇంత గొప్పగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. అలాగే కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. తన దృష్టిలో నాయకుండంటే తాను బలంగా ఉండి మిగతావారు ఎలా ఉండాలి..? ఏం చేయాలి..? అని చెప్పడం కాదని, నాయకుడు జట్టును ముందుండి నడిపించాలని, అదే తాను నమ్ముతానని పేర్కొన్నాడు. ఆటగాళ్లందరినీ తనతో కలిపి ముందుకు తీసుకెళ్తానని శాంసన్ వివరించాడు. ఆటగాళ్లంతా వివిధ రకాల ఆలోచనలతో, వ్యక్తిత్వాలతో ఉంటారని, వారందరినీ తనతో కలిపి ముందుకు నడిపించడమే కెప్టెన్ బాధ్యతగా భావిస్తానని చెప్పాడు. అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఆటగాళ్లందరి భుజంపై చెయి వేసి తానున్నాననే నమ్మకం వారిలో కల్పిస్తానని శాంసన్ వివరించాడు. అలాగే తాను బౌలింగ్ కెప్టెన్‌నని, ఫీల్డింగ్ చేసే సమయంలోనే కెప్టెన్ బాధ్యత కీలకమని తాను నమ్ముతానని, అందువల్ల తనను తాను బ్యాటింగ్ కెప్టెన్‌గా కాక, ఫీల్డింగ్ కెప్టెన్‌గానే భావిస్తానని శాంసన్ తెలిపాడు.