భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాజాగా భారత ఆటగాళ్లకు సంబంధించి వార్షిక కాంట్రాక్ట్ వివరాలను ప్రకటించింది. ఎప్పటిలానే కొందరు ఆటగాల్లకు ఏ+, కొందరికి, ఏ, మరికొంతమందికి బీ+, బీ కేటగిరీల్లో ఆటగాళ్ల వివరాలను వెల్లడించింది. అయితే రవీంద్ర జడేజాకు ‘ఎ’ గ్రేడ్ మాత్రమే ఇచ్చింది. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శలు గుప్పించాడు. భారత జాతీయ జట్టులో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత జడేజానే ‘ఎ+’ కేటగిరీకి పూర్తి అర్హత ఉన్న ఆటగాడని వాన్ అభిప్రాయపడ్డాడు. ‘రవీంద్ర జడేజా చాలాకాలంగా భారత జట్టు తరపున మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు., జట్టుకు ఎంతో కీలకంగా మారాడు. అలాంటప్పుడు అతడికి ‘ఎ+’ కేటగిరీలో ఎంపిక చేయకపోవడం ఏంటి..?. జడేజాను ‘ఎ+’ గ్రేడ్‌లో తీసుకోవడానికి చర్చలు జరిపినా, చివరకు అతనికి దాన్ని కేటాయించకపోవడం సమంజసం కాదు. వార్షిక కాంట్రాక్ట్‌ల్లో జడేజాకు సరైన స్థానం కల్పించకపోవడం అతడిని అవమానించిందని నేను భావిస్తున్నానం’టూ వాన్ పేర్కొన్నాడు.
కాగా.. 2019 నుంచి 2020 వరకు భారత జాతీయ జట్టు క్రికెటర్ల కాంట్రాక్ట్ గతేడాది సెప్టెంబరు 30తో ముగియడంతో కొత్త కాంట్రాక్ట్‌ల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. మొత్తం 28 మంది ఆటగాళ్లతో కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఏ+ కేటగిరీలో ఉన్నారు. వీరు ముగ్గురూ వరుసగా మూడో ఏడాది ‘ఎ+’ కేటగిరీలో కొనసాగుతున్నారు. ఈ ముగ్గురికి ఏడాదికి రూ. 7 కోట్లు చొప్పున బీసీసీఐ చెల్లించనుంది. తాజా కాంట్రాక్ట్ 2020 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు అమలులో ఉంటుంది. అంతేకాకుండా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గ్రేడ్ ‘బి’ నుంచి ‘ఎ’కు… పేస్ బౌలర్ శార్దుల్ ఠాకూర్‌కు గ్రేడ్ ‘సి’ నుంచి ‘బి’కి బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే వాన్ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. భారత క్రికెట్లో నీకేం పనంటూ సోషల్ మీడియాలో కడిగిపారేస్తున్నారు. ‘భారత జట్టుపై, భారత క్రికెట్ బోర్డుపై ఎప్పుడూ వివాదాస్పదమైన కామెంట్స్ చేయడం ఇంగ్లండ్ క్రికెటర్లకు అలవాటైపోయిందని, ముందు మీ దేశ ఆటగాళ్ల గురించి ఆలోచించండ’ని కొందరు విహర్శిస్తుండగా.. మరికొందరు మాత్రం వాన్ చెప్పిన మాట వాస్తవమేనని జడేజాకు ఏ+ కేటగిరీ ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు.