ఐపీఎల్ 14 సీజన్లో దారుణంగా విఫలమైన జట్టేదైనా ఉందంటే.. అది కోల్‌కతా నైట్ రైడర్సే. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించిన తర్వాత ఆ జట్టు పూర్తిగా లయ కోల్పోయింది. రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి చవి చూసింది. ఇక మూడో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కూడా గెలవాల్సిన మ్యాచ్‌లో కూడా ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే కేకేఆర్ జట్టుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడిపోవడానికి చెత్త కెప్టెన్సీనే కారణమని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ దుయ్యబట్టాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్.. ఏబీ డివిలియర్స్ (76 నాటౌట్: 34 బంతుల్లో 9×4, 3×6), గ్లెన్ మాక్స్‌వెల్ (78: 49 బంతుల్లో 9×4, 3×6) చెలరేగడంతో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన కోల్‌కతా టీమ్ 166/8కే పరిమితమైంది. స్పిన్‌కి ఆరంభంలో పిచ్ అనుకూలించినట్లు కనిపించినా.. కోల్‌కతా కెప్టెన్ అనాలోచిత నిర్ణయాలతో జట్టు ఓటమికి కారణమయ్యాడని గౌతమ్ గంభీర్ విమర్శించాడు.
మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. రెండో బంతికి ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(5: 6 బంతుల్లో 1×4) అవుట్ చేశాడని, విరాట్ చాలా పెద్ద వికెట్ అని, అంత పెద్ద వికెట్ కోల్పోయిన తర్వాత సాధారణంగా జట్టు ఒత్తిడిలోకి వెళుతుందని, ఆ ఓవర్లోనే ఆఖరి బంతికి రజత్ పాటిదార్(1: 2 బంతుల్లో)ల వికెట్ కూడా తీసి మరింత ఒత్తిడి పెంచడమే కాకుండా.. కేకేఆర్‌కు మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడని గంభీర్ అన్నాడు.
‘వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడంలో ఆ ఓవర్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లు చాలా ఇబ్బంది పడ్డారు. మొత్తంగా ఆ ఓవర్‌లో మూడు పరుగులిచ్చిన వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టాడు. కానీ.. ఆ తర్వాత అతనితో 8వ ఓవర్ వరకూ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ చేయించలేదు. ఒకవేళ నాలుగో ఓవర్‌ని వరుణ్ చక్రవర్తి వేసి ఉంటే..? అతను మాక్స్‌వెల్ వికెట్ పడగొట్టేవాడని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ మాక్స్‌వెల్ ఆరంభంలోనే ఔటై ఉంటే..? అప్పుడు ఏబీపై ఒత్తిడి పడేది. భారత్‌కి చెందిన ఏ కెప్టెన్ కూడా ఇంత చెత్త నిర్ణయం తీసుకోడు” అని గంభీర్ అన్నాడు.
మోర్గాన్‌పై విమర్శలు చూస్తూనే.. అతడి కెప్టెన్సీని భారత కెప్టెన్‌ల కెప్టెన్సీతో పోల్చాడు. భారత్‌కు చెందిన ఏ కెప్టెన్ కూడా ఇలా చెత్త నిర్ణయం తీసుకోడని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఓ బౌలర్ తన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసినా, అతడిని పక్కన పెట్టడం నిజంగా బుద్ధిలేని చర్యని మండిపడ్డాడు. ఇలాంటి చెత్త కెప్టెన్సీని తన జీవితంలో చూడలేదని, ఇలాంటి దారుణమైన కెప్టెన్సీతో ముందుకెళ్తే అతి త్వరలోనే కేకేఆర్ ఇంటి ముఖం పడుతుందని విమర్శలు గుప్పించాడు.