ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచింది. 124 పరుగుల లక్ష్యం ఛేదించేందుకు కూడా చెమటోడ్చిన కేకేఆర్ రాహుల్ త్రిపాఠి, మోర్గాన్ రాణించడంతో గెలుపు దక్కించుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. రెండింటిలో రాణించిన కేకేఆర్.. ఈ పిచ్‌పై బోణీ కొట్టింది. తొలుత ఓపెనర్లు నితీశ్ రాణా(0) గోల్డెన్ డక్‌గా వెనుతిరగడం, ఆ వెంటనే శుభ్‌మన్ గిల్(9) కూడా వికెట్ల ముందు దొరికిపోవడంతో కేకేఆర్ కష్టాల్లో పడింది. అయితే వన్ డౌన్‌లో రాహుల్ త్రిపాఠి(41: 32 బంతుల్లో.. 7 ఫోర్లు) వికెట్ కాపాడుకుంటూనే చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అతడికి చక్కగా సహకరించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(47 నాటౌట్: 40 బంతుల్లో.. 4 ఫోర్లు, 2 సిక్స్‌లు).. త్రిపాఠి అవుటైన తర్వాత బాధ్యత తన భుజాలపైకి ఎత్తుకున్నాడు. నెమ్మదిగా ఆడుతూ జట్టుకు విజయాన్నందించాడు. దీంతో మరో 20
బంతులు మిగిలుండగానే.. కేకేఆర్ విజయం దక్కించుకుంది. కాగా.. పంజాబ్ బౌలర్లలో హెన్‌రిక్స్, మహ్మద్ షమి, అర్షదీప్ సింగ్, దీపక్ హుడాలకు తలా ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్.. మరోసారి పేలవ బ్యాటింగ్‌తో అభిమానులను నిరాశపరిచింది. ప్రారంభంలోనే జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్(19) అవుట్ కావడం, ఆ వెంటనే క్రిస్ గేల్(0) ఆడిన తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుతిరగడం, దాని నుంచి తేరుకోకముందే.. ఇన్ ఫామ్ బ్యాట్స్‌మన్ దీపక్ హుడా(1) కూడా పెవిలియన్ చేరడంతో పంజాబ్ అభిమానులు షాక్ తిన్నారు. అయితే మయాంక్ అగర్వాల్(31), నికోలస్ పూరన్(19) ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వీరిద్దరితో పాటు మొయిసెస్ హెన్రిక్స్(2) కూడా వెంటవెంటనే అవుట్ కావడంతో స్కోరు బోర్డు కదలకుండా మొరాయించింది. ఇక షారూఖ్ ఖాన్(13) కూడా ఈ సారి నిరాశపరిచాడు. దీంతో 18వ ఓవర్లో 95 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను పేసర్ క్రిస్ జోర్డాన్(30: 18 బంతుల్లో.. 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆదుకున్నాడు. జోర్డాన్ బాదుడుతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్.. 9 వికెట్లకు 123 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణకు 3 వికెట్లు దక్కగా.. సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తి, శివమ్ మావిలకు కూడా చెరో వికెట్ దక్కింది.