వాషింగ్టన్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రతి రోజూ లక్షల మందిని కబళిస్తోంది. వేల మంది ఉసురు తీస్తోంది. దీనిని నిర్మూలించేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ వైరస్ మహమ్మారి కోరల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైద్యులు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. భారత్‌లో లాక్‌డౌన్ తప్పదని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయంగా కరోనా వైరస్‌పై అధ్యయనం చేస్తున్న కరోనా వైద్య నిపుణుడు డాక్టర్ అంథోనీ ఎస్ ఫౌచీ భారత్‌లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పందించారు. కరోనా వ్యాప్తి నిర్మూలించేందుకు దేశంలో కనీసం కొన్ని వారాల పాటైనా లాక్‌డైన్ తప్పదని సలహా ఇచ్చారు.
ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా నియంత్రణకోసం 6 నెలలపాటు భారత్ కచ్చితంగా లాక్‌డౌన్ పాటించాల్సిందే. కనీసం రెండు, మూడు వారాలైనా దేశం మొత్తం షట్‌డౌన్ చేయకుండా ఈ మహమ్మారిని నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చు. ఇక కరోనా వ్యాక్సిన్ పంపిణీ కూడా వేగవంతం చేయాలన్నారు. ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించి, ఉత్పత్తిని కూడా పెంచాలి. ఆక్సిజన్, ఔషధాలు మొదలైనవాటి కోసం ఇతర దేశాల సహాయం తీసుకోవాలి. తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే పరిస్థితులను అదుపులోకి తీసుకురావచ్చ’ని సూచనలందించారు. అంతేకాకుండా కరోనా నియంత్రణలో అమెరికా అనుసరించిన విధానాలను అమలు చేయాలని సలహా ఇచ్చారు.
కాగా.. ప్రస్తుతం భారత్‌లో వారం రోజులుగా ప్రతి రోజూ మూడు లక్షల కేసులు నమోదవుతున్నాయి. 3 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. వీటితో పాటు ఆక్సిజన్ కొరత దేశాన్ని వణికిస్తోంది. కొన్ని ఆసుపత్రుల్లో ఇప్పటికే ఆక్సిజన్ లోపం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కూడా పోతున్నాయి. అయితే తాజాగా వివిధ దేశాల నుంచి వ్యాక్సిన్‌లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలు భారత్‌కు అండగా ఉండేందుకు తమవంతు సాయం అందిస్తున్నాయి.
కాగా డాక్టర్ ఫౌచీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వైద్య సలహాదారునిగా పనిచేస్తున్నారు.