ఐపీఎల్ 14వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఫాంలో దూసుకుపోతోంది. అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్లు విజృంభించారు. దీంతో ఢిల్లీ సునాయాస విజయం సాధించింది. మరో 14 బంతులు మిగిలుంగానే 7 వికెట్ల తేడాతో పంజాబ్‌ను మట్టి కరిపించింది. ఓపెనర్ శిఖర్ ధవన్(69 నాటౌట్: 47 బంతుల్లో.. 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆఖరివరకు క్రీజులో ఉండడమే కాకుండా.. అర్థ సెంచరీతో రాణించి పంజాబ్ ఓటమిని శాసించాడు. అతడికి పృధ్వీ షా(39), స్టీవ్ స్మిత్(25), రిషబ్ పంత్(14) చక్కగా సహకరించారు. ఇక చివర్లో 16 పరుగులు 18 పరుగులు కావల్సి ఉండగా.. షిమ్రన్ హెట్‌మెయిర్(16 నాటౌట్: 4 బంతుల్లో.. 1 ఫోర్, 2 సిక్స్‌లు) బాది లాంఛనం పూర్తి చేశాడు. దీంతో 17.4 ఓవర్లలోనే ఢిల్లీ 3 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కు కెప్టెన్ కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడం ప్రధాన లోటుగా కనిపించింది. దీనిని అధిగమించేందుకు తాత్కాలిక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ప్రయత్నించినా ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. ఇక పంజాబ్ బౌలర్లలో రైలీ మెరెడిత్, క్రిస్ జోర్డాన్, హర్ప్రీత్ బ్రార్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ప్రారంభంలోనే దెబ్బ తగిలింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్(12) కొద్ది సేపటికే అవుటయ్యాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(99 నాటౌట్: 58 బంతుల్లో.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చివరి వరకు క్రీజులో పాతుకుపోయి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. అయితే అవతలి వైపు క్రిస్ గేల్(13), డేవిడ్ మలాన్(26) కొద్ది సేపటికే అవుట్ కావడం, ఆ తర్వాత స్టార్ బ్యాట్స్‌మన్ దీపక్ హుడా(1) కూడా వెంటనే అవుట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. కానీ వికెట్లు పడిపోతున్నా అగర్వాల్ మాత్రం ధాటిగా ఆడాడు.
మొదట నెమ్మదిగా ఆడినప్పటికీ అర్థ సెంచరీ దాటిన తర్వాత ఎదురుదాడికి దిగాడు. అర్థ సెంచరీకి 37 బంతులు తీసుకున్న మయాంక్.. ఆ తర్వాత 21 బంతుల్లోనే 49 పరుగులు చేసి అదరగొట్టాడు. మయాంక్ పోరాటంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో గౌరవ ప్రదమైన 199 స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లలో రబాడా 3 వికెట్లు తీయగా, ఆవేష్ ఖాన్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.