టీమిండియా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. 32 ఏళ్ల జింక్స్ భార్య రాధికతో కలిసి ముంబైలోని వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లిన రహానే.. తొలి డోస్ వ్యాక్సిన్ షాట్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని రహానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కేవలం తమ కోసమే కాకుండా.. చుట్టు ఉన్నవారి కోసం టీకా వేయించుకున్నామని ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అజింక్య రహానే తెలిపాడు. ‘నేను, నా సతీమణి రాధిక ధోపవ్కర్ ఈరోజు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాం. మేము కేవలం మా కోసమే కాకుండా, మా చుట్టు ఉన్నవారి కోసం టీకా వేయించుకున్నాం. అర్హులైనవారంతా రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాల’ని జింక్స్ తన ట్వీట్లో పేర్కొన్నాడు.
ఇక అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తున్న ఐపీఎల్ 14వ సీజన్లో బయోబబుల్ సెక్యూర్‌కు కరోనా మహమ్మారి సెగ తగలడంతో బీసీసీఐ లీగ్‌ను రద్దు చేసింది. మంగళవారం టోర్నీ వాయిదా పడటంతో విదేశీ ఆటగాళ్లంతా ప్రత్యక విమానాల్లో స్వదేశాలకు వెళ్లిపోగా టీమిండియా ఆటగాళ్లంతా తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. టోర్నీలో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరగ్గా.. మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కాగా అజింక్య రహానే ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో దుమ్మురేపింది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది.
Got my first dose of the vaccine today. I urge everyone to register and get yourself vaccinated, if you’re eligible pic.twitter.com/VH2xYcTQ1i
— Ajinkya Rahane (@ajinkyarahane88) May 8, 2021
కాగా.. గురువారం టీమిడియా సీనియర్ ఓపెనెర్ శిఖర్ ధావన్ కూడా కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నవిషయం తెలిసిందే. కరోనా మహమ్మారి సంక్షోభంలో ముందుండి పోరాడుతున్న యోధులకు ధన్యవాదాలు తెలియజేశాడు. వీలైనంత త్వరగా ప్రజలు వ్యాక్సిన్ వేయించుకొని.. వైరస్‌ను ఓడించాలని ధావన్ సూచించాడు. రహానే, ధావన్ ఇద్దరు భాతర జట్టులోనే కాకుండా.. ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సభ్యులు కావడం విశేషం. భారత క్రికెట్ జట్టులో అందరికంటే ముందుగా హెడ్ కోచ్ రవిశాస్త్రి టీకా వేసుకున్నాడు. మార్చి మొదటి వారంలో అతను మొదటి డోస్ తీసుకున్నాడు.