బీహార్: వరకట్న వేధింపులకు మరో ఇల్లాలు బలైంది. ప్రాణాలు పోలేదు కానీ, ఉన్నా జీవశ్చవంలా మారింది. బీహార్‌లోని సుపాల్ పరిధిలోని కిసాన్‌పూర్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఓ వివాహితురాలిని కట్నం కోసం 8 నెలలుగా ఇంట్లో బందీ చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులకు వెంటనే మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ ప్రమీలా కుమారి సంఘటనా స్థలానికి చేరుకుని.. ఆమెను బందీ చేసిన ఇంటి తాళం పగులగొట్టి ఆమెను బయటకు తీసుకువచ్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిసాన్‌పూర్‌కు చెందిన విక్రమ్ చౌదరి కుమారుడు సంజయ్ చౌదరికి ఢిల్లీలోని నోయిడాకు చెందిన యువతితో 2018 మార్చి 7న వివాహం జరిగింది. పెళ్లి టైంలో వధువు తండ్రి కారుతో పాటు రూ.17 లక్షలు కట్నంగా ఇచ్చారు. తరువాత ఆ దంపతులు కిసాన్‌పూర్‌లో కాపురం పెట్టారు. వారికి ఏడాదిన్న వయసుగల కుమార్తె కూడా ఉంది. అయితే కొంతకాలంగా అత్తామామలు మరో రూ.10 లక్షల రూపాయలు తీసుకురావాలని కోడలిపై వేధింపులు మొదలుపెట్టారు.
దానికోసం ఇంటికి వెళ్లిన ఆమె.. అడినంత మొత్తం తీసుకురాలేదు. దీంతో భర్త, అత్తామామలు కలిసి ఆమెను 8 నెలలుగా గదిలో బంధించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. ఆమెను విడిపించి అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.