హైదరాబాద్: ఎంసెట్ దరఖాస్తు గడువు పెంచుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా కారణంగా ఓసారి ఈ గడువును పెంచగా.. ఇప్పుడు మరోసారి గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. జూన్ 24 వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇప్పటికే ఓసారి గడువు పెంచినప్పటికీ ఇప్పుడు మరోసారి పొడిగించడంతో మరింత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయనన్నారు.
కాగా.. రాష్ట్రంలో సెట్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఓ ప్రణాళిక తయారు చేసినట్లు సమాచారం. ఆ నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేయగా.. ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది.
ఈ సందర్భంగా విద్యా మండలి చైర్మన్ టీ పాపిరెడ్డి మాట్లాడుతూ.. జూలై 5 నుంచి 9 వరకు జరగాల్సిన 3 ప్రవేశ పరీక్షలను రీషెడ్యూల్ చేసామన్నారు. మొత్తం 7 సెట్స్‌లో 3 సెట్స్ తేదీల్లో మార్పులు జరిగాయని, మిగిలిన 4 సెట్స్ పరీక్షలు యధాతథంగా ఉండే అవకాశం ఉందని అన్నారు. ఆగస్టు చివరి వారంలో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 15 నాటికి అడ్మిషన్స్ పూర్తిగా చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
అలాగే సెట్స్‌తో పాటు డిగ్రీ పీజీ పరీక్షల నిర్వహణ తేదీల్లో కూడా మార్పు ఉంటుందని, డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు కామన్ పాలసీని అమల్లోకి తెస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు.