Friday, April 4, 2025

వివేకా హత్య కేసు దర్యాప్తులో కొత్త మలుపు.. రూటు మార్చిన సీబీఐ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో దర్యాప్తును కొత్త మలుపు తిప్పింది సీబీఐ. ఇప్పటివరకు దర్యాప్తు చేసిన కోణంలో కాకుండా మరో కొత్త కోణంలో దర్యాప్తును మొదలు పెట్టింది. ఇప్పటికే పులివెందులలో 11 రోజులుగా విచారణ చేస్తున్న సీబీఐ బృందం.. ఈ సారి కొత్త కోణంలో దర్యాప్తు కొనసాగిస్తోంది. దర్యాప్తులో భాగంగా కొత్త ప్రాంతాల్లో.. కొత్త వ్యక్తులను సీబీఐ విచారిస్తోంది.

అయితే గతంతో పోల్చితే ఇది మరో కొనమనే చెప్పాలి. ఇప్పటివరకు పాత వ్యక్తులనే మళ్లీ మళ్లీ పిలిచి విచారించేవారు. వివేకా వద్ద డ్రైవర్‌గా పని చేసిన దస్తగిరి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయతుల్లా, ఇతర వాచ్‌మెన్‌లు, వంట మనుషులను పదే పదే విచారించేవారు. అయితే ఈ సారి డ్రైవర్‌ దస్తగిరి, ఇనాయతుల్లాతో పాటు పులివెందులకు చెందిన కిరణ్‌ కుమార్‌ యాదవ్‌, సునీల్‌ కుమార్‌ అన్నదమ్ములతో పాటు వారి తండ్రి కృష్ణయ్య, కుటుంబ సభ్యులందరినీ విచారించారు.

అలాగే పులివెందులకే చెందిన ఎర్ర గంగిరెడ్డి, గంగాధర్‌, సుంకేశులకు చెందిన జగదీశ్వర్‌రెడ్డితో పాటు మరో మహిళను కూడా విచారించారు. కృష్ణయ్య కుటుంబం అప్పట్లో వివేకానందరెడ్డితో సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కడప జిల్లాలోని చిట్వేల్‌ మండలానికి చెందిన లక్ష్మాకర్‌, రమణ అనే వ్యక్తులను కూడా తొలిసారి విచారించారు.

ఇదిలా ఉంటే సీబీఐలోని ఓ బృందం బెంగళూరుకు వెళ్లి.. అక్కడి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. వివేకా హత్యకు ముందు.. పులివెందులకు చెందిన వ్యక్తులు బెంగళూరులో తరచూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను కలిసేవారని తెలియడంతో వారి ఫోన్‌ సంభాషణల ఆధారంగా విచారణ చేపట్టినట్టు సమాచారం. బెంగళూరులోని ముగ్గురు రియల్టర్లను సీబీఐ విచారించినట్టు తెలిసింది.

అప్పట్లో వైఎస్‌ వివేకానందరెడ్డికి బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఉన్నందున వివేకా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈ వ్యాపారం చూసేవారని.. ఈ నేపథ్యంలోనే ఒక దశలో వివేకా హత్యకు బెంగళూరులోనే కుట్ర జరిగిందని అప్పట్లో టాక్‌ వచ్చింది. ఈ క్రమంలో సిట్‌, ఆ తరువాత సీబీఐ బృందాలు అక్కడ విచారణ చేపట్టినట్టు ప్రచారం అవుతోంది. బెంగళూరుతో పాటు అనంతపురం, మరికొన్ని ప్రాంతాల్లో కూడా సీబీఐ బృందం పర్యటించి.. విచారించినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే పులివెందులలోని వివేకా నివాసంలో ఆయన కూతురు సునీతను ఇటీవల 2 సార్లు సీబీఐ బృందం కలిసి మరోసారి చర్చలు జరిపారు. సునీతారెడ్డి సీబీఐ ఉన్నతాధికారులకు గతంలో అనుమానితుల జాబితాను అందించింది. అయితే ఆ జాబితాలో వ్యక్తులను ఇప్పటివరకు సీబీఐ విచారణ చేయలేదని.. వివేకా కుటుంబ సభ్యులు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2 సార్లు వరుసగా సునీతారెడ్డిని కలిసినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో సునీత కడప ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి.. తమ నివాసం వద్ద భద్రత కల్పించాలని కోరడం చర్చనీయాంశంగా మారింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x