నర్సాపురం ఎంపీ రఘురామ రాజుకి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించినట్లు సీఐడీ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆయనకు వై కేటగిరీ భద్రతను కొనసాగించేందుకు కోర్ట్ అనుమతించింది. అయితే కేంద్ర బలగాలు కాకుండా, రాష్ట్ర పోలీసులే ఆయనకు రక్షణ కల్పిస్తారని వెల్లడించింది. ఈ మేరకు న్యాయవాది లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం రఘురామను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని, ఆ తర్వాత అక్కడి నుంచి రమేష్ హాస్పిటల్‌లో వైద్యం అందిస్తారని తెలిపారు. అయితే రఘురామకృష్ణంరాజు ఆరోగ్యం మెరుగుపడే వరకు ఆయనను జైలుకు తలలించరని లాయర్ లక్ష్మి నారాయణ తెలిపారు.
కాగా.. శుక్రవారం రఘురామకృష్ణంరాజును ఆయన ఇంటి నుంచి ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టడం, సామాజిక అశాంతిని రేకెత్తించడం, ప్రభుత్వంపై అసమ్మతిని ఎగదొయ్యడం కోసం కుట్ర పూరితంగా వ్యవహరించిన వంటి విషయాల్లో తమకు ఫిర్యాదులు అందాయని, అందుకే ఆయనను అరెస్ట్ చేస్తున్నామని సీఐడీ తెలిపింది.
అయితే ఈ కేసులో భాగంగా రఘురామకృష్ణంరాజుకు బెయిల్ కావాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ న్యాయస్థానం ఆ పిటీషన్‌ను కొట్టివేసింది. ముందు సీఐడీ కోర్టును ఆశ్రయించాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. దాంతో వారు గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ అరెస్టు అక్రమం అని అతడి తరపు న్యాయవాదులు వాదించారు. అంతేకాకుండా అతడి శరీరంపై ఉన్న గాయాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విచారణలో భాగంగానే రఘురామ.. తనను పోలీసులు కొట్టారంటూ లిఖిత పూర్వకంగా పిటిషన్ దాఖలు చేయడంతో ఆయనను ముందుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. ఈ సమయంలోనే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు హైకోర్టులో స్పెషల్ మోషన్ మూవ్ చేశారు. ఈ పిటిషన్ నేపథ్యంలో ఆయన కేసును ప్రత్యేక డివిజన్ బెంచ్ విచారించనుంది. జస్టిస్ ప్రవీణ్ నేతృత్వంలో ఈ స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటు కానుంది.
కాగా.. రఘురామకు గాయాలు తగ్గే వరకు ఆయనను ఆసుపత్రిలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. దీనికోసం ఆయనను జీజీహెచ్‌లో పరీక్షల అనంతరం రమేశ్ ఆసుపత్రికి తరలించనున్నారు. అతడికి ఉన్న వై-క్యాటగిరీ భద్రతా సిబ్బంది రాఘురామతోనే ఉంటుందని తెలిపింది.ఈ క్రమంలోనే స్పెషల్ డివిజన్ విచారణ పూర్తయితే ఆయన జైలుకు వెళ్లే అవసరం లేకపోవచ్చని న్యాయవాదుల అంచనా వేశారు. కానీ ఉన్నట్లుండి ఈ కేసులో సీఐడీ కోర్టు షాకింగ్ తీర్పిచ్చింది. అదేంటంటే.. రఘురామకృష్ణంరాజును ఆసుపత్రిలో చికిత్స పూర్తయిన తరువాత ఆయనను జైలుకు తరలించాలంటూ ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసు మరి మునుముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.