హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఇలాంటి ప్రభుత్వం తమకొద్దని వాపోతున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో ఇన్ని బాధలు ఉంటాయని తెలంగాణ ప్రజలు ఊహించి ఉండరని, ఊహించని స్థాయిలో ప్రజలను కేసీఆర్ సర్కార్ సమశాలకు గురి చేస్తోందని ఈటల అన్నారు.
తన డీఎన్‌ఏను పక్కన పెడితే మరో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమంలో ప్రజల కాళ్ల మధ్యలో తిరిగిన వ్యక్తిని తానని ఈటల పేర్కొన్నారు. సుష్మా స్వరాజ్, విద్యాసాగరరావు లాంటి నేతలతో కలిసి ఉద్యమంలో తాను పనిచేశానని ఆయన వివరించారు. చరిత్ర మొదలు కావటానికి ఏదో ఒక పార్టీ తోడు ఉండాలి కాబట్టే టీఆర్ఎస్‌లో పనిచేశానని ఈటల పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే అసైన్‌మెంట్ భూముల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో మంత్రి వర్గం నుంచి కేసీఆర్ తొలగించారు. మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత వివిధ పార్టీల నేతలు, అభిమానులతోనూ చర్చలు జరిపిన ఈటల ఆఖరుకు బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. టీఆర్‌ఎస్‌పై పోరాడేందుకు బీజేపీ మాత్రమే సరైన వేదికగా ఈటల భావించారు. అందులో భాగంగానే బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌తోను.. ఇతర అగ్ర నేతలతోనూ సంప్రదింపులు జరిపారు. తనపై అన్యాయంగా అసైన్‌మెంట్ భూముల ఆరోపణలు చేయించి.. పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని ఈటల రగిలిపోతున్నారు.
టీఆర్‌ఎస్ వల్ల వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ స్వయంగా గెలిచి చూపించాలని నిర్ణయించుకున్నారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ నాయకత్వాన రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విజయం సాధించిన ఈటల.. ఇప్పుడు తన ఆత్మాభిమానం కోసం ఉద్యమ పార్టీకి వ్యతిరేకంగా అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ కు అందజేయగా ఆయన ఆమోదం కూడా లభించింది. అనంతరం సోమవారం ఈటల అధికారికంగా బీజేపీలోకి చేరారు.