యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో మరియమ్మ మృతిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్సీ మహిళ లాకప్‌డెత్ అత్యంత బాధాకరమని, మరియమ్మ లాకప్‌డెత్ ఘటనలో పోలీసుల తీరు ఏ మాత్రం సమర్థనీయం కాదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరియమ్మ మృతిపై సమగ్ర విచారణ చేసి కారణాలను వెలికి తీయాలని, నిజనిర్ధారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
అంతేకాకుండా మరియమ్మ మృతికి బాధ్యులైన వారిని అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ స్వయంగా చింతకాని వెళ్లి బాధితులను పరామర్శించి రావాలని సూచించారు.
ఎస్సీల పట్ల సమాజం దృక్పథం మారాలని సీఎం ఆకాంక్షించారు. ఎస్సీలు, పేదల పట్ల పోలీసుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని అన్నారు.
ఎస్సీల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదని, వారికి అన్యాయం జరిగితే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.
ఇలాంటి ఘటనలు ప్రభుత్వం సహించబోదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.
అనంతరం మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్‌కు ప్రభుత్వం తరపున రూ.15 లక్షల పరిహారం అందిస్తామని, అలాగే ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నివాస గృహం కూడా మంజూరు చేస్తామని చెప్పారు.
మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.