అత్యంత కట్టుదిట్టమైన బయోబబుల్ వాతావరణంలో నిర్వహిస్తున్నప్పటికీ ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో ఈ ఏడాది ఐపీఎల్ అర్థాంతరంగా రద్దయిన విషయం తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లంతా వారి వారి దేశాలకు వెళ్లిపోయారు. ఇక స్వదేవీ ఆటగాళ్లు ఇళ్లకు చేరుకున్నారు. అయితే రెండు నెలల పాటు కొనసాగాల్సిన సీజన్ కేవలం నెల రోజుల్లోనే నిలిచిపోయింది. దీంతో బీసీసీఐకి వేల కోట్ల నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో మిగిలిన టోర్నీని కూడా ఈ ఏడాది పూర్తయ్యేలోగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికోసం వేదికలను వెతికే పనిలో కూడా పడింది. అయితే ఈ టోర్నీ ఎప్పుడు నిర్వహిస్తారో అటుంచితే.. నెమ్మదిగా అనేక దేశాలు ఈ సీజన్‌కు దూరమువుతున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్ ఆటగాళ్లు మిగిలిన టోర్నీకి దూరం కాగా.. తాజాగా న్యూజిల్యాండ్ కూడా ఈ జాబితాతో చేరింది.
ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచన చేస్తున్నా.. ఇప్పటికే దీనికోసం వేదికలు వెదుకుతున్నా.. అది అంత సులువు కాదని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పటికే ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశకు బిజీ ఇంగ్లండ్ క్రికెటర్లు అందుబాటులో ఉండరని ఈసీబీ ప్రకటించింది. తాజాగా ఒకవేళ ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో నిర్వహిస్తే కివీస్ ప్లేయర్లు లీగ్‌లో ఆడే అవకాశాలు లేనట్లు సమాచారం. సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో కివీస్ జట్టు ఓ సిరీస్ ఆడనుంది. అంటే సెప్టెంబర్‌లోనే మిగతా ఐపీఎల్ జరిగితే కివీస్ ప్లేయర్లు అందుబాటులో ఉండరన్నమాట.
పాకిస్తాన్ సిరీస్‌ను కివీస్ చాలా కీలకంగా భావిస్తోంది. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని కివీస్ ఈ సిరీస్‌ను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో కెప్టెన్ విలియమ్సన్, బౌల్ట్ సహా తదితర ఆటగాళ్లంతా ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే ఐపీఎల్ సెకండ్ సీజన్ ఏ మాత్రం కలర్ ఫుల్‌గా ఉండదు. లీగ్‌లో విదేశీ ఆటగాళ్లు ఎంతో కీలకం. దీంతో వారు లేకపోతే.. టోర్నీ వెలవెలబోతుంది. ఫ్రాంచైజీలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో ఐపీఎల్ 14 సీజన్ రీ షెడ్యూల్ సాధ్యమవుతుందా..? లేదా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.