టీమిండియా మాజీ కెప్టెన్, టాపార్డర్ బ్యాట్స్‌మన్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ భారత జట్టు తరపున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కెప్టెన్‌గా కూడా చెప్పుకోదగిన విజయాలు సాధించాడు. అయితే టీమిండియా కెప్టెన్‌గా రాహుల్ ఎంపికైనప్పుడు అతడికి జట్టు సభ్యులంతా కనీస సహకారం కూడా అందించలేదని అప్పటి టీమిండియా కోచ్ గ్రెగ్ చాపెల్ సంచలన ఆరోపణలు చేశాడు. జట్టు సభ్యుల్లో ఐకమత్యం లేకపోవడం వల్లనే అప్పట్లో టీమిండియా దారుణంగా విఫలమైందని కూడా ఆరోపించాడు.
గ్రెగ్ చాపెల్ భారత జట్టుకు 2005-2007 మధ్యకాలంలో కోచ్‌గా పనిచేశాడు. ఆ సమయంలో ద్రవిడ్‌ను టీమిండియా కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ద్రవిడ్ కెప్టెన్ అయిన తర్వాత జట్టు దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా 2007 వరల్డ్ కప్‌లో టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టింది. ఆడిన 3 మ్యాచ్‌లలో ఓడి ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఇందులో బంగ్లాదేశ్ చేతిలో కూడా భారత్ ఓడడం గమనార్హం.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గ్రెగ్ చాపెల్ అప్పటి టీమిండియాపై సంచలన ఆరోపణలు చేశాడు. ‘ద్రవిడ్ తన సారథ్యంలో భారత్‌ను నెంబరవన్ జట్టుగా తీర్చిదిద్దాలనుకున్నాడు. కానీ సహచర ఆటగాళ్ల మద్దతు అతనికి లభించలేదు. ఇక వెస్టిండీస్ వేదికగా జరిగిన 2007 ప్రపంచకప్ టోర్రీలో భారత్ కనీసం సూపర్-8కు కూడా అర్హత సాధించకుండానే నిష్క్రమించింది. కెరీర్ చివరి దశకు చేరిన సీనియర్లు జట్టులో స్థానం కాపాడుకోవడంపైనే దృష్టి సారించేవారు. వారికి జట్టు ప్రయోజనాలు అవసరం లేదు. వారిలో టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ కూడా ఉన్నాడు. అయితే గంగూలీపై వేటు పడటంతో ఆటగాళ్ల వైఖరిలో మార్పు వచ్చింది’ అని గ్రెగ్ పేర్కొన్నాడు.
అంతేకాకుండా గంగూలీ వల్లే తనకు టీమిండియా కోచ్‌గా పనిచేసే అవకాశం దక్కిందని, రెండేళ్ల పదవీ కాలం ముగిశాక కూడా తననే కోచ్‌గా కొనసాగమని బీసీసీఐ కోరినా.. ఆ ఒత్తిడి అవసరం లేదనుకుని స్వచ్ఛందంగా తప్పుకున్నానని చాపెల్ చెప్పాడు. ఇక చాపెల్‌ను టీమిండియా కోచ్‌గా తీసుకురావడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పని గంగూలీ తన ఆత్మ కథ ‘ఏ సెంచరీ నాట్ ఏ ఎనఫ్’లో రాసుకొచ్చాడు. కాగా.. ద్రవిడ్ నేతృత్వంలో భారత జట్టు 25 టెస్ట్‌లు, 79 వన్డేలు ఆడి 50 విజయాలు సాధించింది.