కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ధాటికి యావత్ దేశం వణికిపోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ వస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపించనుందని వస్తోన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. థర్డ్ వేవ్ విజృంభణలో చిన్న పిల్లలు తీవ్రంగా ప్రభావితం అవుతారనే సూచనలు ఇప్పటివరకు లేవని స్పష్టం చేసింది. ఈ వార్తలపై స్పందించిన ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఇవి పూర్తిగా అసత్యాలని, వీటిని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవని స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. థర్డ్ వేవ్‌లో చిన్న పిల్లలు ఈ మహమ్మారి బారినపడతారన్న దానికి సరైన ఆధారాలేవీ లేవన్నారు. నిజానికి కరోనా బారినపడుతున్న చిన్నారులు అతి తక్కువని, గణాంకాలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. ఏస్ రెసెప్టార్స్(గ్రాహకాలు) ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని, పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఇవి చాలా తక్కువగా ఉంటాయని, అందువల్ల థర్డ్ వేవ్ వచ్చినా.. పిల్లలపై అది అంత ప్రభావం చూపే అవకాశాలు లేవని గులేరియా వివరించారు.
ఇక నీతి ఆయోగ్(హెల్త్) సభ్యులు వీకే పాల్ మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ చిన్నారులు వైరస్ బారినపడిన పడితే.. వారిలో లక్షణాలు కనిపించకపోవచ్చు లేదా స్వల్పంగానే ఉండవచ్చు. సాధారణంగా ఆస్పత్రిలో చేర్పించాల్సిన పరిస్థితులు మాత్రం ఉత్పన్నం కావు. చిన్నారులకు వైరస్ సోకుతుందనే కొన్ని వాస్తవాలు మనముందున్నాయి. వారిలోనూ ఓ మోస్తరు వరకు పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. పిల్లల్లో వైరస్ సంక్రమణ తక్కువగా ఉందని కచ్చితంగా చెప్పలేము. డిసెంబర్-జనవరి మధ్య నిర్వహించిన సీరో సర్వేలో చిన్నారుల్లో సీరో-పాజిటివిటీ రేటు పెద్దవారితో దాదాపు సమానంగా ఉంది’’ అని వీకే పాల్ వెల్లడించారు.
అయితే చిన్నారుల నుంచి వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం మాత్రం ఉందన్నారు. కొవిడ్ సోకిన చిన్నారులకు చికిత్స చేసేందుకు వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచుకోవాలని.. అదే సమయంలో వైరస్ సంక్రమణలో వీరిని ముందు వరుసలో రాకుండా చూసుకోవడమే అత్యంత ముఖ్య విషయమన్నారు. కాగా.. దేశంలో గత 22 రోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నట్లు అధికాులు తెలిపారు. మే 10న 37,45,237 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. నేడు 27.20 లక్షలకు తగ్గాయన్నారు. అలాగే, 8 రోజులుగా వరుసగా 3 లక్షల కంటే తక్కువ కేసులే నమోదవుతున్నాయని, దీనిని బట్టి చూస్తే కరోనా తగ్గుముఖం పడుతోందని తెలిపారు.