విదేశీ ఆటగాళ్లు వచ్చినా, రాకపోయినా ఐపీఎల్-14 సెకండ్ షెడ్యూల్ కచ్చితంగా నిర్వహిస్తామని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఎవరికోసమూ టోర్నీ ఆగదని, ప్రస్తుత ప్రణాళిక ప్రకారమే యూఏఈ వేదికగా సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 మధ్యలో లీగ్‌ను నిర్వహిస్తామని వెల్లడించింది. దీనికి సంబంధించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్-14ను పూర్తి చేయాలని భారత క్రికెట్ బోర్డు పట్టుదలగా ఉన్నట్టు వెల్లడించారు. కొందరు విదేశీ ఆటగాళ్లు లీగ్‌కు దూరంగా ఉన్నా, భారత స్టార్ ఆటగాళ్లు లీగ్‌కు వన్నె తెస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా.. వెస్టిండీస్ పర్యటనతో పాటు వ్యక్తిగత కారణాల వల్ల ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్-14 సెకండ్ షెడ్యూల్ వాళ్లు లేకుండానే జరుగుతుందా..? అనే అనుమానాలు అభిమానుల్లో కలుగుతున్నాయి. ఇదే సమయంలో ఆసీస్ ఆటగాళ్లు జట్టులో ఉన్న ఫ్రాంఛైజీలు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే పనిలో పడ్డాయి.
ఇదిలా ఉంటే ఐపీఎల్ నిర్వహణ ప్రణాళిక, షెడ్యూల్ తదితర అంశాలపై చర్చించేందకు బీసీసీఐ ఆఫీస్ బేరర్లు త్వరలోనే యూఏఈలో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. మ్యాచ్‌లకు ఫ్యాన్స్‌ను అనుమతించడంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎమిరేట్స్ క్రికెట్ క్లబ్ అధికారులే చెబుతుండడంతో కచ్చితంగా లైవ్ యాక్షన్ చూసే అవకాశం కొందరు ప్రేక్షకులకు దక్కే అవకాశం లేకపోలేదు.