ఉమ్మడి తెలుగు రాష్ట్ర మాజీ సీఎం, దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరు బయటకొచ్చింది. ఈ పేరుకు ఎన్నికల సంఘం గుర్తింపు కూడా లభించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైటీపీ) పార్టీ పేరుతో షర్మిల ముఖ్య అనుచరుడు రాజగోపాల్ ఇటీవల ఎన్నికల కమిషన్లో పార్టీ నమోదు చేశారు. దీనికి సంబంధించిన పత్రాలను రాజగోపాల్ సీఈసీకి సమర్పించారు. ఆపార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. ఈ పార్టీ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కూడా తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇదే షర్మిల పెట్టబోయే పార్టీ అని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల జరిగిన పార్టీ సన్నాహక సభలో త్వరలోనే పార్టీ పేరు వెల్లడిస్తామని షర్మిల ప్రకటించారు. అందుకనుగుణంగా చకచకా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే వైటీపీ పేరును నమోదు చేయడం, దానికి ఈసీ అమోదం తెలపడం జరిగిందని సమాచారం. వైటీపీకి చైర్మన్గా కూడా రాజగోపాల్ వ్యవహరించనున్నారు. ఈసీ డాక్యుమెంట్ల ప్రకారం మార్చి 23న వైటీపీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంది. షర్మిల స్థాపించబోయే నూతన పార్టీ ఇదేనని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే షర్మిల అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి.
కాగా.. దీనిపై గురువారం ఈసీ ఓ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. అందులో ‘భారత రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 29ఏ సెక్షన్ను అనుసరించి కొత్త పార్టీగా గుర్తింపు కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ దరఖాస్తు చేసుకుంది. ఈ పేరుతో పార్టీ గుర్తింపునకు ఎవరైనా, ఏవైనా అభ్యంతరాలు చెప్పాలనుకుంటే ఈ నెల 16లోగా ఢిల్లీ నిర్వచన్ సదన్(ఈసీ ప్రధాన కార్యాలయాన్ని) సంప్రదించండి’ అని ఆ నోట్లో పేర్కొంది.