ఈ మధ్యనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ యూఏఈకి తరలిపోయింది. కరోనా దెబ్బకు గతేడాది యూఏఈలోనే జరిగిన ఈ టోర్నీ.. ఈ ఏడాది సగం వరకు భారత్‌లో జరిగినా.. మిగతా సగం టోర్నీని యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఇక తాజాగా ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కూడా భారత్ నుంచి తరలిపోయినట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్ నిర్వహణపై తేల్చేందుకు బీసీసీఐకి నెల రోజుల గడువు కోరింది. అయితే పొట్టి ప్రపంచక్‌పను యూఏఈ, ఒమన్‌లలో జరిపేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని బీసీసీఐ ఇదివరకే ఐసీసీకి తెలిపింది. అయితే హక్కులు మాత్రం తమకే ఉండాలని షరతు పెట్టింది. ఈ మేరకు యూఏఈ క్రికెట్ బోర్డుకు కూడా అవసరమైన ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
అక్టోబరులో భారత్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం సాధ్యం కాదు. దానికి తోడు అప్పటికి థర్డ్ వేవ్ ప్రభావం కూడా ఉంటుందనే కథనాలు
వినిపిస్తున్నాయి. అలాగే వర్షాలు కూడా ప్రభావం చూపిస్తాయి. ఇక 8 జట్లతో కూడిన ఐపీఎల్ టోర్నీనే దేశం లోపల నిర్వహించకుండా పక్కకు తరలించిన సమయంలో.. 16 జట్లను సమన్వయం చేయడం ఒకరకంగా అసాధ్యమే. అందుకు బీసీసీఐ ఈ నిర్ణయం వైపే మొగ్గు చేపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ నెల 1న ఐసీసీ బోర్డు సమావేశంలోనే బీసీసీఐ ఈ విషయంపై స్పష్టతనిచ్చిందని బోర్డు వర్గాలు తెలిపాయి. ‘ఐసీసీ బోర్డు సమావేశంలో బీసీసీఐ నెల రోజుల గడువు అడిగిన విషయం వాస్తవమే. అయితే టోర్నీ ఆతిథ్య హక్కులు తమ దగ్గరే ఉంచుకుంటూ.. మ్యాచ్‌లను మాత్రం యూఏఈ, ఒమన్‌లలో జరిపేందుకు అభ్యంతరం లేదని అంతర్గతంగా తెలిపింది. నాలుగో వేదికగా ఉన్న ఒమన్ రాజధాని మస్కట్‌లో ప్రిలిమనరీ రౌండ్ జరుగుతుంది. దీంతో ఐపీఎల్ ముగిశాక యూఏఈ మైదానాలను సిద్ధంగా ఉంచేందుకు 3 వారాల సమయం లభిస్తుంద’ని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.