తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చేందుకు కంకణం కట్టుకున్న వైఎస్ షర్మిలకు పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్-09 లేదా జూన్-08న పార్టీ ఆవిర్భావం ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏపీలో జగన్ నాయకత్వంలో ‘వైఎస్సార్‌సీపీ’ ఉండగా.. తెలంగాణలో మాత్రం ‘వైఎస్సార్‌టీపీ’గా పార్టీ పేరు ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు గాను ఇప్పటికే ఈ పేరు కోసం ఎన్నికల కమిషన్‌కు ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నట్లు సమాచారం. మొత్తానికి చూస్తే.. పార్టీ విషయమై ఏప్రిల్-09న ఖమ్మంలో జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభతో ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. పార్టీ త్వరలోనే ప్రారంభించబోతున్న తరుణంలో అందుకు సంబంధించిన జెండా, అజెండాలను షర్మిల దగ్గరుండి మరీ సిద్ధం చేసుకుంటున్నారు. ఓ వైపు ఈ పనులు చేసుకుంటూనే మరోవైపు.. జనాల్లోకి తన స్వరాన్ని తీసుకెళ్లి వైఎస్ అభిమానులతో సమన్వయపరచడానికి షర్మిల కీలక నిర్ణయమే తీసుకున్నారు. పార్టీ ప్రకటన కంటే ముందుగానే వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కమిటీలన్నీ మార్చి- 16లోగా పూర్తి చేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నారట. వైఎస్ అభిమానులు, కార్యకర్తలతో ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని.. ఈ బాధ్యతలన్నింటినీ పిట్టా రాంరెడ్డికి షర్మిల అప్పగించారు.
మరోవైపు.. షర్మిలకు రోజురోజుకూ నేతల బలం పెరుగుతోంది. ఇప్పటికే వేలాది మంది అభిమానులు, ద్వితియశ్రేణి నాయకులు, మాజీలు, కీలక నేతలు, కార్యకర్తలు షర్మిలకు తమ మద్దతు తెలియజేశారు. మరోవైపు జిల్లాల బాట బట్టిన ఆమె నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో ఆ పర్యటన కాస్త ఆలస్యమైంది. కోడ్ గానీ లేకుంటే ఖమ్మం జిల్లా నుంచే తన కొత్త పార్టీకి శ్రీకారం చుట్టేవారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, వైఎస్ వీరాభిమానమున్న వారు షర్మిల పార్టీలోకి వచ్చేస్తున్నారు.