ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఓడింది. హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ దారుణ ఓటమిని చవి చూసింది. మరికొద్ది సేపు క్రీజులో నిలబడితే డ్రాగా ముగిసే అవకాశం కూడా ఉన్నా.. భారత బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తి వికెట్లు సమర్పించుకున్నారు. ప్రతి బ్యాట్స్ మెన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో భారత్ ను న్యూజిలాండ్ సునాయాసంగా ఓడించి తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ గా నిలిచింది.
రెండో ఇన్నింగ్స్ సాగిందిలా..
టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఇన్నింగ్స్ కంటే దారుణంగా ఆడింది. కేవలం 170 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్(41; 88 బంతుల్లో 4×4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ పేసర్లు టిమ్‌సౌథీ 4/48, బౌల్ట్ 3/39 రాణించడంతో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 32 పరుగులు కలుపుకొని న్యూజిలాండ్ అంతిమ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు 64/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆరో రోజు రిజర్వ్‌డే ఆట కొనసాగించిన టీమిండియా.. కెప్టెన్ విరాట్ (13; 29 బంతుల్లో), చతేశ్వర్ పుజారా (15; 80 బంతుల్లో 2×4) తీవ్రంగా నిరాశపరిచారు. ఆట ప్రారంభమైన అరగంటకే ఒక్క పరుగు తేడాతో ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు. జేమీసన్ వరుస ఓవర్లలో వీరిని ఔట్ చేసి టీమిండియా వెన్ను విరిచాడు.
కివీస్ సెకండ్ ఇన్నింగ్స్ సాగిందిలా..
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 45.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్ కేన్ విలియమ్సన్ (52; 89 బంతుల్లో 8×4), రాస్‌టేలర్ (47; 100 బంతుల్లో 6×4) బాధ్యతగా ఆడి కివీస్‌కు అపురూప విజయం అందించారు. అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్ ఓపెనర్లు టామ్ లాథమ్(9; 41 బంతుల్లో), డెవాన్ కాన్వే(19; 47 బంతుల్లో 4×4)ను ఔట్ చేసి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. దాంతో ఆ జట్టుపై ఒత్తిడి పెంచే అవకాశం దక్కినా టీమ్ఇండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఓటమిపాలై ఐసీసీ ట్రోర్నోల్లో మరోసారి భంగపాటుకు గురైంది.