ఇప్పటికే మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఈ రకం కేసులు వెలుగుచూస్తుండగా.. తాజాగా మధ్యప్రదేశ్‌లో నెల రోజుల క్రితం ఓ మహిళ మరణానికి ‘డెల్టా ప్లస్’ కారణంగా తేలింది. ఈ వేరియంట్‌లో ధ్రువీకరించిన తొలి మరణం ఇదే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 40కి పైగా డెల్టా వేరియంట్ కోవిడ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అంచనా. ఇక తాజాగా మధ్యప్రదేశ్‌లో మొదటిసారిగా డెల్టా ప్లస్ వేరియంట్‌తో ఓ కరోనా కరోనా రోగి మరణించడం దేశాన్నే తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొవిడ్ సోకి మే 23న ప్రాణాలు కోల్పోయారు. ఆమె రక్తనమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఆమెకు డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన ఐదు కేసులు బయటపడ్డాయి. భోపాల్‌లో మూడు, ఉజ్జయినిలో రెండు కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు వైరస్ నుంచి కోలుకోగా.. ఒకరు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. డెల్టా ప్లస్ వేరియంట్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రకం సోకిన వారిని గుర్తించి కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెట్టారు.
డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాపిస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ మంత్రి విశ్వస్ సారంగ్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో భారీగా టెస్టులు నిర్వహిస్తున్నాం. డెల్టా ప్లస్ వేరియంట్ రోగుల కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోంది. డెల్టా ప్లస్ వైరస్ సోకిన ఐదుగురిలో నలుగురు వ్యాక్సిన్ వేయించుకున్నారు. వారంతా కోలుకున్నారు. కానీ టీకా తీసుకోని మహిళ మాత్రం మరణించార’ని కోరారు. డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అర్హులైనవారంతా కోవిడ్ టీకాలు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.