యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో దళిత మహిళ మరియమ్మ (55) లాకప్ డెత్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రాన్ని ఓ కుదుపునకు గురి చేసింది.
తాజాగా ఈ ఘటన ప్రభావం పక్క రాష్ట్రాలకు కూడా పాకింది. ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్, మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రావత్… మరియమ్మ లాకప్ డెత్ పై స్పందించారు.
తెలంగాణ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. కనీసం మహిళా పోలీసులు లేకుండా మరియమ్మను ఎలా అరెస్ట్ చేశారని నిలదీశారు.
‘లాకప్ డెత్ చేసిన వాళ్ళను సస్పెండ్ చేశారు. మరి మరియమ్మ బతికి వస్తుందా..? రాబోయే ఎన్నికలలో దళితులు టీఆర్ఎస్ కు ఓట్లు వేయవద్దు.
ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపాలి. మరియమ్మ సంఘటన తీవ్ర ఆవేదన కలిగించింది.
జస్టిస్ ఫర్ అల్ కోసం అందరం ఉధృతంగా పోరాడాల’ని నితిన్ రావత్ పిలుపునిచ్చారు.
అంతేకాకుండా సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ ఎన్నో కలలు కన్నారని, ఆహన కలలను సాకారం చేయడం కోసం అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రతి ఇంటికి వెళ్లి, అందరినీ కలుపుకుని పోరాటం చేద్దామని, అందరినీ చైత్యన్యవంతులను చేసి కలిసికట్టుగా న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
మరియమ్మ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తుందని రావత్ స్పష్టం చేశారు.
కాగా.. ఇప్పటికే దళిత, ప్రజా సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి.
హైకోర్టు సైతం పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ కూడా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి, సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు.