రెండు నుంచి 17 ఏళ్లలోపు ఉన్న పిల్లలపై కొవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం తాజాగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ డెసిషన్‌తో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు షాక్ తగిలినట్లైంది.
ఇప్పట్లో అలాంటి పనులు చేయవద్దని, పిల్లలపై టీకా రెండు, మూడో దశ ట్రయల్స్ నిర్వహించడానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఎలాంటి అనుమతి ఇవ్వవద్దని డీసీజీఐకి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.
జులై నుంచి చిన్నారులపై కొవావ్యాక్స్ టీకా ప్రయోగాలు జరపాలని సీరమ్ భావించింది. అందులో భాగంగా కొవొవాక్స్ క్లినికల్ ట్రయల్స్‌ను.. 12 నుంచి 17 ఏళ్ల లోపు 460 మందిపై, 2 నుంచి 11ఏళ్లలోపున్న460 మంది చిన్నారులపై, మొత్తంగా 960 మందిపై దేశవ్యాప్తంగా 10 చోట్ల ట్రయల్స్ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని డీసీజీఐని సీరం కోరింది.
తాజాగా ఈ దరఖాస్తుపై చర్చించిన నిపుణుల బృందం.. కోవోవాక్స్ ఇప్పటివరకు ఏ దేశంలోనూ అనుమతి పొందనలేదని, అందువల్ల దీనికి అనుమతులు ఇవ్వలేమని ప్రకటించింది.
అంతేకాకుండా పిల్లలపై క్లినికల్స్ ట్రయల్స్ చేయడంకంటే ముందుగా.. ప్రస్తుతం పెద్దలపై జరుగుతున్న కొవావాక్స్ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను సమర్పించాలని సీరంను ఆదేశించింది.
ఆ డేటాను, వాటి ఫలితాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చిన్నారులపై ప్రయోగాల అంశంపై చర్చిస్తామని తేల్చి చెప్పింది.
కాగా అమెరికాకు చెందిన నొవావాక్స్ అభివృద్ధి చేసిన ఈ కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో ‘కొవొవాక్స్’ పేరుతో ఉత్పత్తి చేసేందుకు సీరమ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే మార్చిలో 18ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిపై ఈ కొవావ్యాక్స్ క్లినికల్ ట్రయల్స్‌ను కంపెనీ ప్రారంభించింది.