అత్యాచారం ఎంత దారుణమైన చర్యో వేరే చెప్పక్కర్లేదు. ఇక మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే అది ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించరాని నేరం.
ఇలా మైనర్లను బలాత్కరించిన వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసేలా ఇటీవలే చట్ట సవరణలు కూడా జరిగాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇలాంటి చట్టాలేవీ అమలులో ఉన్నట్లు కనిపించడం లేదు.
ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఓ వ్యక్తికి స్థానిక పంచాయతీ పెద్దలు ఓ వింత శిక్ష విధించారు. అంత దారుణమైన తప్పు చేసిన నిందితుడు.. బాధితురాలి చేతిలో 5 చెప్పు దెబ్బలు తినడమే అతడికి శిక్ష అని ప్రపంచమే నివ్వెరపోయే ఓ తీర్పునిచ్చారు ఆ పంచాయతీ పెద్దలు.
వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లాలోని కోతిభార్ పోలీస్ స్టేషన్ పరిథిలోని ఓ కుగ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తమ మైనర్ కూతురిపై అదే గ్రామంలోని ఓ యువకుడు అత్యాచారం చేశాడంటూ తల్లిదండ్రులు పంచాయితీని ఆశ్రయించారు. తమకు న్యాయం కావాలని వేడుకున్నారు.
అయితే ఈ ఘటనపై భారీగా విచారణ జరిపిన తర్వాత.. సదరు పంచయతీ పెద్దలు.. బాధితురాలి చెప్పుతో నిందితుడిని 5సార్లు కొట్టాలని, 50 వేల పరిహారం తీసుకుని ఘటన మరిచిపోమ్మని బాలిక తల్లిదండ్రులకు చెప్పారు.
ఈ తీర్పుతో ఆగ్రహం చెందిన ఆ తల్లిదండ్రులు వారి తీర్పును పూర్తిగా వ్యతిరేకించారు. న్యాయం కోసం పట్టుబట్టారు. అయితే ‘మా తీర్పునే వ్యతిరేకిస్తారా..?’ తీరులో ఆ పెద్దలు.. బాలిక తల్లిదండ్రులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో బాధితురాలి తల్లి.. కోతిభార్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అలాగే పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పును, వారి తీరును కూడా వివరిస్తూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఈ తీర్పు ఆ నోటా.. ఈ నోటా పాకి సోషల్ మీడియాకు చేరింది.
దీంతో విపరీతంగా వైరల్ అయింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిపై పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాలిక వైద్య పరీక్షల నివేదిక అనంతరం.. కేసు దిశగా అడుగు వేస్తామని జిల్లా ఎస్పీ ప్రదీప్ గుప్తా వెల్లడించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.